ఏపీకి రాబోయేది కష్టకాలమేనా?.  

June 06, 2020

ఏపీలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతోన్న సంగతి తెలిసిందే. మంగళవారం ఒక్కరోజే 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు ఏర్పడ్డాయి. మరోవైపు, ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు సరిగా నిర్వహించడం లేదని, అందుకే కేసుల సంఖ్య తక్కువగా ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తిపై టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ సరిగా లేదన్న చంద్రబాబు ...ఈ విషయంపై రాజకీయం చేయబోనన్నారు. కరోనా విపత్తు నిర్వహణలో లోపాలను ఎత్తి చూపడమే తన ఉద్దేశ్యమని, సరైన రీతిలో కరోనా పరీక్షలు చేయలేకపోవడం వల్ల, వాస్తవాలు మరుగునపడిపోతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, ఇదే విషయంపై ఇప్పటికే కేంద్రానికి, రాష్ట్రానికి అనేక లేఖలు రాశానని చెప్పారు. కరోనా నివారణలో ఈ ప్రభుత్వానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేసిన చంద్రబాబు....మరింత పకడ్బందీగా కరోనా విపత్తు చర్యలు నిర్వహించాలని సూచించారు.  

కరోనాను కట్టడి చేయడం ఒక ఎత్తయితే....కరోనా తర్వాత భవిష్యత్తులో రాష్ట్రంలోని పరిస్థితులను అంచనా వేయగలగడం మరో ఎత్తని చంద్రబాబు చెప్పారు. అన్ని రంగాలపై కరోనా ప్రభావం పడుతోందని ముఖ్యంగా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు.. రైతులు ఇబ్బందులు పడుతున్నారని, కరోనా ని కట్టడి చేస్తే సరిపోదని...భవిష్యత్తులో రైతాంగం ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందన్న కారణంతో పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతిందని, రొయ్యలు, చేపలన్నీ చెరువుల్లోనే ఉన్నాయని, వాటిని కోనేవారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే రొయ్యలు, చేపల కొనుగోలుకు ఒక రేటిచ్చి ప్రైవేటు వ్యక్తులు కొనాల్సిందిగా చెబుతోందని...అలా కొనేందుకు ఎవరూ ముందుకు రారని అన్నారు. అందుకే, వాటికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసి ప్రభుత్వమే రొయ్యల రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

హార్టీకల్చర్ రంగం కూడా కుదేలైందని, పంటలన్నీ పొలాల్లోనే ఉండిపోయాయని, కూలీలు, ట్రాక్టర్ డ్రైవర్లు దొరకని పరిస్థితులున్నాయని అన్నారు. కొన్ని రోజుల తర్వాత రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరత వస్తుందని, దానిని ఎదుర్కొనేందుకు ఎగుమతులు నిలిపివేయడం...గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వమే ఆహార, చిరు ధాన్యాలను కొనడం వంటివి చేయాలని అన్నారు. వలస కూలీలకు వసతి, భోజన సదుపాయాలు కల్పించి వారిని కరోనా బారిన పడకుండా కాపాడాలని అన్నారు.  విదేశాల నుంచి వచ్చే వారిని క్వారంటైన్ లో పెట్టి....ముందు జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, తాను ఈ పరిస్థితిని రాజకీయం చేయడం లేదని అన్నారు. కరోనా విపత్తు సమయంలో తన మద్దతు...ఈ ప్రభుత్వానికి ఉంటుందని అన్నారు. అసలే ఆర్థిక లోటులో ఉన్న ఏపీకి రాబోయేది కష్టకాలమని...ముందుచూపుతో వ్యవహరించకుంటే కష్టమని చంద్రబాబు చెప్పారు.