ఏపీలో నేతలంతా... జనానికి ఎప్పుడో దూరమైపోయారు

May 26, 2020

నవశకానికి నాందీ పలుకుతూ కొత్త శిఖరాలు అధిరోహిస్తుందని ఆశించిన నవ్యాంధ్ర భవిష్యత్తు అగమ్య గోచరంగానే కనిపిస్తోంది. అసలు ఏపీకి ఉజ్వల భవిష్యత్తు అందిస్తామనం చెబుతున్న నేతలంతా... జనానికి ఎప్పుడో దూరమైపోయారు. జనానికి దూరమైపోయిన నేతలు... జనం హర్షించదగ్గ నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు కదా. సో... ఏపీకి ఉజ్వల భవిష్యత్తు అందిస్తామని చెబుతున్న నేతలంతా... జనానికి దూరంగానే సాగుతున్న నేపథ్యంలో జనాకర్షక నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.ఈ తరహా పరిస్థితికి దారి తీసిన కారణాలను ఓ సారి పరిశీలిద్దాం పదండి.

తెలుగు నేల విభజనకు గురైన తర్వాత 13 జిల్లాలతో కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పాటైన ఏపీకి ఆర్థిక టోలు తోడైంది. ఆ లోటును పూడ్చుకునేందుకు కేంద్రం సహకరిస్తుందనుకుంటే... తనకు అంతగా అనుకూలంగా లేని ఏపీకి ఎందుకోసం సాయం చేయాలన్న దిశగా నరేంద్ర మోదీ సర్కారు వ్యవహరించింది. ఫలితంగా ఏపీ పట్ల వ్యతిరేకతతో ఉన్న మోదీ  అండ్ కోను మచ్చిక చేసుకుని రాష్ట్రానికి వీలయినంత మేర మేలు చేద్దామని టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆశించారు. ఈ క్రమంలోనే ఆయన నోట ఏపీ ప్రజలు బలంగా ఆశిస్తున్న ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ మాట వినిపించింది. దీంతో షాక్ తిన్న ప్రజలు టీడీపీపై అనుమానాలు పెంచుకున్నారు. ఆ అనుమానాలు అంతకంతకూ పెరుగుతూ వచ్చాయి తప్పించి తగ్గిన దిశగా టీడీపీ చర్యలు చేపట్టేందుకు అవకాశం లేకుండా పోయింది.

సరిగ్గా.. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదాకు వెన్నుదన్నుగా నిలుస్తానంటూ ప్రకటించిన జనసేనాని పవన్ కల్యాణ్ కూడా టీడీపీకి దూరంగా జరిగారు. తదనంతర పరిణామాల్లో పవన్ నోట కూడా ప్రత్యేక హోదా మాట వినిపించలేదు. ప్రత్యేక హోదాను చంపేసిన పార్టీగా బీజేపీ.. తాను బలపడేందుకు మార్గాలను వెతుక్కుంది గానీ... ప్రజల మనసుల్లో మాత్రం మంచి పేరు తెచ్చుకోలేకపోయింది. మొత్తంగా ప్రజల మనసు గాఢంగా ముద్ర వేసుకుపోయిన ప్రత్యేక హోదాను పట్టించుకోని ఈ మూడు పార్టీలను ప్రజలు మొన్నటి ఎన్నికల్లో తిరస్కరించేశారు. అంటే... ప్రజలకు దూరంగా జరిగిన కారణంగానే ఈ మూడు పార్టీలకు పరాజయం తప్పలేదన్న మాట.

అదే సమయంలతో ప్రత్యేక హోదాను సాధించే దిశగా తాను యూటర్న్ తీసుకోలేదంటూ చెప్పిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే ఈ మూడు పార్టీలకు ప్రత్యామ్నాయంగా మారారు. ఫలితంగా ఈ మూడు పార్టీల ఓట్లను లాగేసుకుని బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టేశారు. అంటే... మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం జగన్ కు దక్కిన ప్రజాదరణగా కాకుండా పైన చెప్పుకున్న మూడు పార్టీలు జనానికి దూరమైన కారణంగా దక్కిన గెలుపనే చెప్పుకోవాలి. అంటే... సీఎంగా ఏమాత్రం అర్హత లేని జగన్ లాంటి వారు కూడా సీఎం కావడానికి కేవలం పార్టీలు, నేతలు జనానికి దూరంగా జరగడమేనన్న మాట. 

2024లోనూ ఇదే తరహా ఫలితాలు రిపీట్ కాక మానవు. ఎందుకంటే... టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతిని అంతా రాజధానిగా ఒప్పేసుకున్నారు. అయితే జనం ఇచ్చిన ఓట్లతో గెలిచానని విర్రవీగుతున్న జగన్... ఇప్పుడు ఆ రాజధానిని మూడు ముక్కలు చేసేస్తున్నారు. ఈ తరహా ప్రజాకంటక నిర్ణయాలపై జనానికి ఇప్పటికే పూర్తి వ్యతిరేకత వ్యక్తమైపోయింది. పలితంగా 2024 ఎన్నికల్లో కూడా ప్రజలకు దూరంగా జరిగిపోయిన జగన్ కు కూడా ప్రజల చేతిలోనే ఘోర పరాభవం తప్పదన్న మాట.