చస్తారయ్యా...చస్తే ఎన్నికలు ఆపేస్తారా...?!!

June 02, 2020
CTYPE html>
కరోనా లాంటి వైరస్ లు విరుచుకుపడుతున్న వేళ.. అప్రమత్తతకు మించింది మరొకటి ఉండదు. వైరస్ మొత్తంగా వ్యాపించే కన్నా ముందే.. మేల్కొని అలాంటి పిశాచి విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయాన్ని వదిలేసి.. ఎవరో ఏదో చేశారు కాబట్టి.. మనమూ అలానే చేస్తే ఏమైందన్నట్లుగా చెప్పటాన్ని ఏమనాలి? ఎలా చూడాలి?
తాజాగా అలాంటి తీరునే ప్రదర్శిస్తున్నారు కొందరు. ఏపీలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిర్ణయం తీసుకోవటం.. అందుకు ఏపీ సర్కారు ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం తీవ్రంగా రియాక్ట్ కావటం.. కమిషనర్ పై భారీ ఆరోపణలు చేశారు. ఇదిలా ఉంటే.. వాయిదా వేసిన స్థానిక ఎన్నికల్ని ఆరు వారాల తర్వాత కాదు.. ఇప్పుడే నిర్వహించాలని కోరుతూ ఏపీ సీఎస్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి.. చిగురుటాకులా వణుకుతున్న ఫ్రాన్స్ దేశంలో ప్రస్తుతం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయట. ఆదివారం నుంచే స్టార్ట్ అయిన ఈ ఎన్నికల ముచ్చట తెలిసిన తర్వాత అయినా సరే.. ఏపీలో ఎన్నికలు జరిపించొచ్చు కదా? అంటూ కొత్త వాదనల్ని తెర మీదకు తీసుకొస్తున్నారు.
కరోనా సాకు చూపించి ఏపీలో స్థానిక ఎన్నికల్ని వాయిదా వేసిన నేపథ్యంలో.. ప్రాన్స్ ఉదాహరణ చూపిస్తూ.. ఆ దేశంలో కరోనా అంత తీవ్రంగా ఉన్నా.. ఎన్నికలు నిర్వహిస్తున్నారని.. ఏమీ లేని ఏపీలో ఎందుకు నిర్వహించరు? అంటూ ప్రశ్నిస్తున్న వైనం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
వైరస్ ను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఎన్నికలు నిర్వహిస్తే తప్పేం లేదన్న వాదనలు వినిపిస్తున్నారు. కరోనా కారణంగా ఫ్రాన్స్ లో 91 మంది ప్రజలు మరణించారని.. అయినప్పటికీ ఆ దేశంలో స్థానిక సంస్థలకు ఎన్నికల్ని షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తున్నారని.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటాన్ని తప్పు పడుతున్నారు. మరీ.. ఉదాహరణపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.