కన్నాకు డెడ్ లైన్ పెట్టిన వైసీపీ మంత్రి

May 31, 2020

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో బాగా కాక పుట్టించినట్టున్నాడు. ఇప్పటికీ వారికి కన్నా కలలోకి వస్తున్నట్టున్నాడు. విజయసాయిరెడ్డి ఎన్ని చిందులు వేసినా కూడా కన్నా చెప్పాలనుకున్నది జనాల్లోకి వెళ్లిపోయింది. ఏపీలో పెద్ద ఎత్తున టెస్టింగ్ కిట్ల స్కాం గురించి చర్చ జరిగింది. అయితే... ఈ స్కాం వెనుక వైసీపీ నేత, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  బంధువులకు చెందిన కంపెనీ ఉందని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే... ఇంతకాలం దానిపై స్పందించని బుగ్గన తాజాగా స్పందించారు.

తాజాగా ఆనాటి కన్నా చేసిన వ్యాఖ్యలపై మంత్రి బుగ్గన మండిపడ్డారు. తాను డైరెక్టర్ ఉన్న కంపెనీ ద్వారా కరోనా కిట్లను ప్రభుత్వం కొనుగోలు చేసిందంటూ కన్నా చేసిన వ్యాఖ్యలు ఉత్త నిందలు మాత్రమే అన్నారు. తనపై అనవసర తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రాజకీయాలు నడుస్తున్నాయని బుగ్గన విమర్శించారు.

కరోనా కిట్ల కొనుగోలులో ఎటువంటి అవినీతి జరగలేదు. తాను కనుక కరోనా కిట్లలో అవినీతికి పాల్పడినట్టు తేలితే పదవి వదులుకుంటాను అన్నారు బుగ్గన. అవినీతిపై ఆధారాలుంటే కన్నా లక్ష్మీనారాయణ నిరూపించాలని సవాల్ విసిరారు. రేపు ఉదయం 9 గంటల్లోగా ఆరోపణలను నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ నిరూపించలేకపోతే కన్నా లక్ష్మినారాయణ తన పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు.  అయితే... ఇంతవరకు బాగానే ఉంది గాని కన్నా ఎక్కడ నిరూపిస్తారో అని మరీ 24 గంటల సమయం కూడా ఇవ్వకపోతే ఎలా బుగ్గన గారు. చాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగా ఉండాలి. ఒక వారం అయినా టైం ఇవ్వొచ్చుగా మీకు అవినీతి చేయలేదన్న కాన్ఫిడెన్సు ఉంటే ఎందుకు ఎక్కువ సమయం ఇవ్వరు?