ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్ !

August 07, 2020

ఏపీలో ప్రతి ఊరికి హైదరాబాదుతో సంబంధాలుంటాయి. ప్రతి మండలం వాళ్లకు ఇక్కడ ఆస్తులుంటాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులకు వేర్వేరే గాని ప్రజల దృష్టిలో ఒకటే. ఇరు ప్రాంత ప్రజలు ఆస్తులు అటు ఇటు రెండు చోట్లా కొంటారు. రెండో చోట్లా బంధుత్వాలుంటాయి. ప్రైవేటు వ్యవహారాలన్నిటికి ఇది ఒక రాష్ట్రం కిందే లెక్క. అందుకే రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు బంద్ కావడంతో ఇరు రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి. ప్రజలు ప్రభుత్వాలు రెండు ఇబ్బందులు అనుభవించినా తప్పక నిర్బంధాలు పెట్టారు. 

కొంతకాలం క్రితమే తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలపై ఆంక్షలు ఎత్తేసినా ఏపీ మాత్రం కొనసాగించింది. దీంతో హైదరాబాదులో ఉన్న ఏపీ వాసులు ఇంటికి వెళ్లాలనే కోరిక తీరలేదు. వేల మంది ఇంటికి వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం... భార్యభర్తలకు వర్క్ ఫ్రంహోమే. పిల్లలకు ఆన్ లైన్ క్లాసులే.

ఈ నేపథ్యంలో హైదరాబాదులో అపార్టుమెంటుల్లో ఇరుకిరుకుగా బతకడం ఎందుకు సొంతూరికి వెళ్లి హాయిగా విహరిద్దాం అనుకుంటే ఆంక్షలు అడ్డొచ్చాయి. ఇపుడు అన్ని ఆంక్షలు ఎత్తేశారు. చెక్ పోస్టులు తీసేశారు. అటు ఇటు వెళ్లడం ఇక మీ ఇష్టం అనేశాయి. ఈ ఆంక్షలు ఎత్తేయడం ప్రజల కంటే ప్రభుత్వాలకే ఎక్కువ అవసరం.

ఆంక్షల వల్ల రియల్ ఎస్టేట్, వస్త్ర వ్యాపారం, హాస్పిటాలిటీ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇపుడు ఈ ఆంక్షలు ఎత్తేయడంతో అవి మళ్లీ మెల్లగా పుంజుకునే అవకాశం ఉంది. రేపటి నుంచి ఎటువంటి ఆంక్షలు ఉండవని ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇక మీ ఊరు వెళ్తామంటే మిమ్మల్నెవరూ ఆపరు. కాకపోతే జాగ్రత్తగా వెళ్లి రండి. హాయిగా మీ ఊళ్లో గడపండి.