పాలన గురించి జగన్ అభిమాని పోల్ పెడితే ఏమైందో తెలుసా?

January 19, 2020

జగన్ అప్రతిహత మెజారిటీ చూసి... చంద్రబాబు ఒక్కసారిగా వణికిపోయి ఉంటారు. అదేమీ సామాన్యమైన మెజారిటీ కాదు. ఎందుకంటే... ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లు ఉన్నపుడు అధికారంలోకి రావడానికి ఎన్ని సీట్లు కావాలో... అన్ని సీట్లు కేవలం సీమాంధ్రలోనే రావడం అంటే మాటలు కాదు కదా. అసలు ఇప్పట్లో టీడీపీ కోలుకుంటుందా అన్న భయం కూడా కొన్ని రోజులు బాబును వేధించే ఉంటుంది. కానీ... చంద్రబాబుకు ఎపుడూ అదృష్టంలో దురదృష్టం, దురదృష్టంలో అదృష్టం వెంటాడుతుంటాయి. తాజాగా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వాటి పరిణామాలు చూశాక... చంద్రబాబు బ్రహ్మాండంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. నేనేమీ జగన్ ను ఓడించాల్సిన అవసరం లేదు, జగన్ భస్మాసురుడు అని చంద్రబాబుకే స్వయంగా స్పస్టంగా అర్థమైపోయింది. అందుకే ఇపుడు తాపీగా ఉంటున్నాడు. 

రాష్ట్రంలో అత్యధికులు ఆధారపడ్డ ఇసుక విషయంలో జగన్ వ్యవహరించిన తీరు జనంలో విపరీతమైన వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. ఇసుక అంటే కేవలం నిర్మాణం రంగం, కూలీలు మాత్రమే కాదు. దానికి అనుబంధంగా... ఇనుము, స్టీలు, సిమెంటు వంటి భారీ పరిశ్రమలు స్తంభించిపోయాయి. హార్డ్ వేర్, ప్లంబ్లింగ్, ఎలక్ట్రికల్, పెయింట్స్ తదితర కంపెనీల వ్యాపారం మట్టికొట్టుకుపోయింది. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో పన్నుల ఆదాయం 47 శాతం పడిపోయింది. ఈ విషయం వీడీపీ అసోసియేట్స్ అని... ఒక ప్రఖ్యాత సర్వే సంస్థ తెలిపింది. (ఇది బీజేపీ, జగన్ గెలుస్తుందని చెప్పిన సంస్థ). అయితే... ఈ సర్వేలేవేవో చెబుతుంటాయిలే అనుకుంటున్నారేమో ఇపుడు మీకు ఒక బ్రహ్మాండమైన ఉదాహరణ ఇస్తాం. 

ట్విట్టరులో జగన్ వీరాభిమాని ఒకరు జగన్ పాలన గురించి పోల్ పెట్టారు. సాధారణంగా సోషల్ మీడియాలో ఎవరి అభిమానులు పోల్ పెడితే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తుంటాయి. సాధారణంగా ఈ పోల్స్ కు వెయ్యి రెండు వేల మంది మాత్రమే ఓటు వేస్తుంటారు. అయితే, ఒక అభిమాని ’’నాలుగు నెలల్లో శ్రీ వైఎస్ జగన్ పరిపాలన ఎలా ఉంది?’’ అని ఒక పోల్ పెట్టారు. దానికి అద్భుతంగా ఉంది, బాగుంది, పర్వాలేదు, బాగోలేదు అని నాలుగు ఆప్షన్లు ఇస్తే... బాగోలేదు అనే ఆప్షన్ 67 శాతం మంది ఎంచుకున్నారు. తమాషా ఏంటంటే... ఒక మీడియా సంస్థ పోల్ పెడితే వచ్చినంత స్పందన రావడం విశేషం. 6070 మంది ఓటేస్తే... 67 శాతం జగన్ పరిపాలన బాగోలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. దెబ్బకు ఆ పోల్ ను డిలీట్ చేశారు సదరు అభిమాని. ప్రస్తుతం ఎవరో తీసిన ఆ స్క్రీన్ షాట్ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి రాష్ట్రంలో సామాన్యుల్లో మాత్రమే కాదు, వైసీపీ అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉందన్న విషయం అర్థమవుతుంది.