జగన్ మాటతో ఉడికిపోతున్న జనం

May 28, 2020

జగన్ కోసం జనం.. జనం కోసం జగన్ అని ఎన్నికల ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి మీ మామ, మీ అన్న అంటూ మాయ మాటలు చెప్పావు. ఓటేసేకి వస్తే సాదర స్వాగతం ఎగిరి గంతేశావు, మా ఓట్లు వేయించుకున్నావు, ప్రాణంమీదకు వచ్చింది మా ఇంటికి మేము వస్తామంటే... మీ సావు మీరు చావండి, ఏపీకి మాత్రం రావొద్దు అంటావా జగన్... ఇది ఏపీకి వెళ్లాలనుకున్న ఆంధ్ర ప్రజల ఆవేదన. సొంతూరికి వెళ్లడానికి తెలంగాణ ప్రభుత్వం దయచూపి పాస్ ఇస్తే మిమ్మల్ని రానివ్వను అంటూ ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడం ఎంత హేయం. లక్షల్లో టెస్టులు చేస్తున్నాం అని చెప్తున్న జగన్... ఎంత మందికైనా క్వారంటైన్ ఇస్తామని చెబుతున్న జగన్ ఈ వేల మందికి ఇవ్వలేరా? అంటే చెప్పేవన్నీ అబద్ధాలేనా? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రాణం మీదకు వచ్చి అమ్మానాన్న వద్దకు వెళ్తామంటే మా ఇంటికి మమ్మల్నే పోకుండా అడ్డుకుంటారా? ఇలాంటి వ్యక్తికా మేము ఓటేసింది. మేము ఓట్లేసి గెలిపిస్తే సీఎం అయిన నువ్వు మా ఇంటికి మేము పోకుండా పోలీసులతో గెంటేయిస్తావా అంటూ జగన్ మీద రగిలిపోతున్నారు ఏపీ ప్రజలు. 40 రోజులుగా హైదరాబాదులో ఉండిపోయాం. ఊర్లో స్వర్గం వదిలి గడపదాటకుండా గాలి రాని అపార్టు మెంట్లలో సచ్చీచెడీ బతుకుతున్నాం. ప్రాణభయంతో ఊరికెళ్లి సొంతిట్లో తలదాచుకుందాం అనుకుంటున్నాం... నిన్నేమన్నా సాయం అడిగామా? డబ్బు అడిగామా జగన్? మా ఇంటికి మా ఖర్చులతో మేము వెళ్తుంటే... రోడ్డు మీద పిల్లాపాపలతో ఆపేస్తావా అంటూ జనం జగన్ మీద నిప్పులు చెరుగుతున్నారు. 

శ్రామికులకు మాత్రమే ఏర్పాట్లు చేస్తాం. మిగతా వాళ్లు రావద్దు అంటూ జగన్ నిర్ద్వందంగా ఆపేస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లో రానివ్వం అంటున్నారు. కారణమేంటి అంటే... మీ అందరికీ ఏర్పాట్లు చేయడం కుదరదు అంటున్నారు. మరి పాలన చేతకానపుడు పొగడ్తలు ఎందుకో మరి? ఒకవైపు విజయసాయిరెడ్డి అన్నగొప్పోడు అని జాకీలేసి లేపుతున్నాడు. మరోవైపు సొంత రాష్ట్ర ప్రజలకు సాయం చేయలేం అని ముఖ్యమంత్రి జగన్ చేతులు ఎత్తేస్తున్నాడు. ఇలాంటి ముఖ్యమంత్రికి ఓట్లేసి ఎన్నుకున్నందుకు మా ఖర్మ అనుభవిస్తున్నాం అంటూ తిండీ తిప్పలు లేక తెలంగాణ సరిహద్దులో ఆగిపోయి అవస్థలు పడుతున్న సామాన్యులు జగన్ కు శాపనార్థాలు పెడుతున్నారు. మరి సొంత ప్రజలను కడుపులో పెట్టి కాపాడుకోవాలన్న మంచి బుద్ధి ముఖ్యమంత్రికి ఎపుడు వస్తుందో మరి.