ఏపీ పోలీసులు ఎంత రెచ్చిపోయారంటే...

June 02, 2020

జనం రోడ్ల మీదకు రాకుండా చేయడానికి పోలీసులను భద్రతగా పెడతే... జనాలు ప్రాణాలు తీయడానికే సిద్ధమైపోతున్నారు ఏపీ పోలీసులు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఒక యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. కారణం ఏంటో తెలుసా... మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చాడని దాడి చేసి కొట్టారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్ ఉన్న ఒక గవర్నమెంటు ఉద్యోగిపై దాడికి దిగి పోలీసు స్టేషనుకు తీసుకెళ్లారు. దీంతో స్థానికులు ఆగ్రహించి పోలీస్ స్టేషను వద్దకు ధర్నాకు దిగారు. జనాలు పెద్ద ఎత్తున గుమిగూడారు. 

ఇపుడు ఎవరిని కొట్టినా ఏమనరులే అని విచక్షణా రహితంగా కొట్టాల్సిన అవసరం ఏముంది. ఓ మాదిరిగా కొట్టినా భయపడతారు. గాయాల పాలయ్యేలా కొట్టాల్సిన అవసరం ఏముంది? అయినా కూడా పోలీసులు అధికార దుర్వినియోగాన్ని ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. లాక్ డౌన్ లో ప్రజలు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే పోలీసులు ఎంత దారునంగా వ్యవహరించి ఉంటారో సులువుగా అర్థం చేసుకోవచ్చు. 

ఇక తిరుపతి నుంచి ఉద్యోగం లేక బైకులో సొంతూరుకు వస్తున్న ఒక యువకుడిని బైకు లాక్కుని కొట్టి బాపట్లలో నిర్బంధించారు బాపట్ల పోలీసులు. చివరకు ఆ యువకుడు వీడియో సందేశంలో పోలీసుల వేధింపుల గురించి చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇన్ని అరాచకాలు చేస్తున్నా జగన్ ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. 

తెలంగాణలో కూడా పోలీసులు కొన్ని చోట్ల రెచ్చిపోతున్నా... ప్రజలను విచక్షణ రహితంగా కొడితే పోలీసులను తెలంగాణ సర్కారు క్షమించడం లేదు. వారిపై చర్యలు తీసుకుంటోంది. పక్క రాష్ట్రాన్ని చూసి అయినా ఆంధ్ర గవర్నమెంటు బుద్ధి తెచ్చుకుంటే మంచిది.