జగనన్న కోసం ఖాకీల త్యాగం... జాబితాలో ఐపీఎస్ లూ!

May 28, 2020

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిపోయి సరిపోయింది గానీ... జగనన్న సేవలో తరిస్తూ జగనన్న కోసం త్యాగం చేస్తూ ఎంతమంది ఖాకీలు సస్సెండ్ అయ్యేవారో? నామినేషన్ల ఘట్టం ముగియక ముందు వరకే జగనన్న కోసం త్యాగం చేసి అడ్డంగా బుక్కైపోయిన ఖాకీలపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఇలా జగనన్న కోసం త్యాగం చేసిన పోలీసు అధికారుల్లో ఏకంగా ఇద్దరు ఐపీఎస్ కేడర్ కు చెందిన వారున్నారంటే పరిస్థితి ఏ రేంజిలో ఉందో ఇట్టే ఊహించుకోవచ్చు. జగనన్న సేవలో తరిస్తూ ఎన్నికల సంఘానికి అడ్డంగా దొరికిన వారిలో ఇద్దరు ఎస్పీలు సహా ఏడుగురు డీఎస్పీలు, 10 మంది సర్కిల్ ఇన్ స్పెక్టర్లు ఉన్నారు. వీరిపై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేసింది.

ఏపీలో నిన్నటిదాకా కొనసాగిన నామినేషన్ల పర్వంలో గతంలో ఎన్నడూ చూడనంత హింస చోటుచేసుకుంది. ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను బెదిరించి, దాడి చేసి, కిడ్నాప్ చేసి, బలవంతంగా రాజీనామాలు ఉపసంహరించుకునేలా చేసే క్రమంలో వైసీపీ శ్రేణులు తమదైన శైలిలో రెచ్చిపోయాయి. సరే... రాజకీయ పార్టీల కార్యకర్తలన్నాక అలాంటివి సాధారణమే అయినా... వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, బహిరంగంగానే అధికార పార్టీ శ్రేణులకు వత్తాసు పలకడం నిజంగానే అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రత్యర్థి వర్గంపై దాడులకు తెగబడుతున్న వైసీపీ శ్రేణులను నిలువరించాల్సిన పోలీసులు... వారికి మద్దతుగా నిలవడమే కాకుండా బాధితులపైనే కేసులు నమోదు చేయడం, పోలీస్ స్టేషన్లకు తరలించడం వంటివి చాలానే జరిగాయి.

ఈ తంతు అంతా... జగనన్న కోసం త్యాగం చేయడం కిందకేనని పోలీసులు భావిస్తున్నారట. ఎందుకంటే... జగనన్న కటాక్షం దక్కితే... అనతి కాలంలోనే అందలం ఎక్కవచ్చన్న యావతో కొందరు పోలీసులు... ఖాకీ దుస్తులు వేసుకుని మరీ వైసీపీ కార్యకర్తలకు ఏమాత్రం తీసిపోని విదంగా విపక్షాలకు చెందిన అభ్యర్థులపై విరుచుకుపడ్డారు. అయితే టీడీపీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు టీడీపీ కార్యకర్తలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా వైసీపీ అరాచకాలతో పాటు పోలీసుల దాష్టీకాన్ని కూడా సెల్ ఫోన్లలో రికార్డు చేసేశారు. ఈ దృశ్యాల ఆధారంగానే ఇప్పుడు జగనన్నకు చేదోడువాదోడుగా నిలిచిన పోలీసులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. మొత్తంగా ఈ సస్పెండ్ అయిన అదికారులందరిపై... జగనన్న కోసం త్యాగం చేసి ఏకంగా ఉద్యోగాలనే ప్రమాదంలోకి నెట్టుకున్నారన్న సెటైర్లు వైరల్ అవుతున్నాయి.