హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లొచ్చు.. కండిషన్స్ అప్లై

May 31, 2020

వివిధ దేశాలు, రాష్ట్రాల్లో చిక్కుకున్న వాళ్లను వారి వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లను అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. విదేశాల నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయుల్ని తరలిస్తుండగా.. దేశీయంగా ప్రత్యేక రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌కు ఓ రైలు నడుస్తోంది.

ఐతే ఏపీకి మాత్రం ఎక్కడి నుంచి కూడా రైళ్లు నడవట్లేదు. హైదరాబాద్ నుంచి కూడా ఏపీలోని ఏ సిటీకి కూడా రైలు లేదు. ఐతే ఇక్కడి నుంచి ఏపీకి ప్రత్యేక బస్సులు మాత్రం నడుపుతున్నారు. ఇందుకోసం ‘స్పందన’ వెబ్ సైట్‌ను ఏర్పాటు చేసి.. ఏపీకి వెళ్లాలనుకునేవారి నుంచి వినతులు స్వీకరించింది ప్రభుత్వం. దాదాపు 13 వేల మంది ఇప్పటిదాకా దరఖాస్తు చేసుకున్నారు.

వీళ్ల కోసం ఆర్టీసీ తరఫున ఏసీ, సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ బస్సులో గరుడ ఛార్జీ, సూపర్ లగ్జరీలో ఏసీ ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఐతే ఇలా హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లాలనుకునేవారు ముందే కొన్ని షరతులకు అంగీకరించాలి.

ఏపీలో ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో రెండు వారాలు గడపాలి. ఆ తర్వాతే ఇళ్లకు వెళ్లాలి. అలాగే ప్రయాణం మొదలయ్యే ముందు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. కరోనా లక్షణాలేమీ లేకుంటేనే అనుమతిస్తారు. మాస్కులు ధరించడం తప్పనిసరి.

బస్సుల్లో సీటింగ్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శానిటైజర్లు కూడా పెడుతున్నారు. బస్సును ముందే శానిటైజ్ చేసి ఆ తర్వాత ప్రయాణికుల్ని ఎక్కించనున్నారు. డిమాండును బట్టి రెగ్యులర్ సర్వీసులు మొదలయ్యే వరకు ఇవి నడవనున్నాయి.