బిల్లు మంచిదే జగన్... అమలు చేస్తే మరీ మంచిది

July 01, 2020

ఈరోజు ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనిషి కనీస అవసరాలలో ఒకదానికి సంబంధించిన బిల్లు అది. పరిపాలనలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలా ఉంటుంది. చంద్రబాబు స్టైలు వేరు... ఆయన ప్రయారిటీ ప్రకారం చూస్తారే గానీ ప్రజలకు నచ్చే యాంగిల్లో చూడరు. అందుకే బాబుకు తాత్కాలికంగా తిట్లు, దీర్ఘకాలంలో ప్రశంసలు వస్తుంటాయి. 

జగన్ అలా కాదు, ఏం చేసినా... తక్షణం అందరూ తెలుసుకోవాలి అన్నట్లు చేస్తారు. ఒక మంచి పని గురించి ఎవరికీ గొంతెత్తి చెప్పాల్సిన పనిలేదు. చేస్తే మెల్లగా దాని ఫలితాలు బట్టి అందరూ తెలుసుకుంటారు. ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ’’పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లు‘‘కు ఏపీ శాసనసభలో ఆమోదం లభించింది. వాస్తవానికి ఇది మంచి బిల్లే. అయితే, ఈ బిల్లు అమలు చేయాలంటే... వ్యవస్థలో కఠినత్వం ఉండాలి. తన మన అనే బేధం చూపకూడదు. ఎందుకంటే అన్ని పార్టీల వారు, అన్ని ప్రాంతాల వారు స్కూళ్లు పెడతారు. సరైన నిబంధనలు అమలు చేసే పాఠశాలలు చాలా తక్కువ. ఇపుడు ఈ బిల్లు కఠినంగా అమలు చేస్తే నష్టపోయే వారిలో వైసీపీ వారు, టీడీపీ వారు ఉంటారు. మరి ప్రభుత్వం అందరి పట్ల సమానంగా చర్యలు తీసుకుంటుందా? లేదా టీడీపీ వారిని టార్గెట్ చేయడానికి ఈ బిల్లు వాడుకుంటుందా? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది. 

అంటే ఈ బిల్లు చేయడం మంచి నిర్ణయమే గాని...అమలు చేసినపుడే అది గొప్పది అవడం, దానికి సార్థకత చేకూరడం జరుగుతుంది. ఈ బిల్లు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘‘ఇది ఓ చరిత్రాత్మక ఘట్టం. చదువుకోవడం పిల్లల హక్కు అని, పేదరికం నుంచి బయటపడేసే ఆయుధం చదువే. ప్రతి పేద వాడికి చదువును దగ్గర చేసేందుకే ఈ కమిషన్ తీసుకువస్తున్నాం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చే దిశగా పేద, మధ్య తరగతి ప్రజలకు చదువును ఒక హక్కుగా ఇవ్వాలన్నది మా ఉద్దేశం.దేశంలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే, ఏపీలో 33 శాతం ఉంది. దీన్ని మెరుగుపరచడానికి పాఠశాల విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ బిల్లును తీసుకువచ్చాం’’ అని అన్నారు.

ఈ బిల్లు ద్వారా ఏర్పాటయ్యే కమిషన్ కు ఎలాంటి హక్కులుంటాయి?

1. ఈ కమిషన్ చెప్పిన మాట వినని పాఠశాలలను ముందు హెచ్చరిస్తుంది. 

2. మాట వినకుండా నిబంధనలు ఉల్లంగిస్తే జరిమానా విధిస్తుంది.

3. జరిమానాను లెక్క చేయకుండా మళ్లీ అదే తప్పు చేస్తే పాఠశాలలను మూసివేస్తుంది.