జగన్‌పై సచివాలయ ఉద్యోగుల తిరుగుబాటు

February 23, 2020

ఏపీలో రాజధాని మార్పు అంశం ఎంతగా వివాదాస్పదమైందో.. ఎన్ని ఆందోళనలకు దారి తీస్తోందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాజధాని మార్పు విషయంలో ఏపీ సచివాలయ ఉద్యోగులకు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పిల్లి పిల్లలను తిప్పినట్లుగా తమను ఎన్ని చోట్లకు తిప్పుతారు.. తమ పిల్లల చదువులు ఏం కావాలి.. తమ బతుకులు ఏం కావాలి అంటూ చాలామంది బాహాటంగానే ప్రశ్నిస్తారు. మీ ఇష్టానికి సెక్రటేరియట్‌ను తడవకో నగారినిక మారిస్తే మాకెంత అసౌకర్యమో ఆలోచించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సెక్రటేరియట్‌లోని మహిళా ఉద్యోగులైతే మరింత మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తూ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని తరలింపు ఇంత తొందరగా సాధ్యంకాదంటూ రాజధాని తరలింపు తగదన్న కోణంలో ఆయన మాట్లాడారు. ఈ అంశంపై జరుగుతున్న ప్రచారం కారణంగా ఉద్యోగుల్లో కలవరం మొదలైందని తెలిపారు. అకడమిక్ ఇయర్ మధ్యలో రాజధానిని తరలిస్తే సచివాలయ ఉద్యోగుల పిల్లలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందనే నమ్మకముందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాజధాని తరలింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత తమ సమస్యలను వారి దృష్టికి తీసుకెళతామని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు రాజధానిని మారిస్తే ఉద్యోగులు ఎన్నో సమస్యలకు గురవుతారని.. ఇప్పటికే రాష్ట్ర విభజన తరువాత హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన తాము ఇప్పుడు మళ్లీ విశాఖ వెళ్లాలంటే ఇబ్బందని ఉద్యోగులు అంటున్నారు.