విశాఖలో సెక్రటేరియట్ ఎక్కడ కడతారు?

February 25, 2020

అమరావతి మార్పు అనేది కోర్టులో లేదా కేంద్రం చొరవతో ఆగాలి. ఆ రెండూ జరగకుంటే రాజధాని మార్పు మాత్రం కచ్చితంగా జగన్ చేసి తీరుతాడు. చేస్తున్నది మంచా? చెడా? అనే ఆలోచన లేకుండా తనదే నెగ్గాలనే మనస్తత్వం ఉన్న జగన్ తన నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతారని ఎవరూ ఊహించరు. సంపద సృష్టిపై ఏ మాత్రం దృష్టి పెట్టని జగన్... ఇపుడు కంపెనీలు తెచ్చిపెట్టే పరిస్థితి, అనుభవం తనకు లేదని... అందుకే అమరావతి నిర్మాణం తన వల్ల కాదని అర్థం చేసుకున్నారు. అందుకే ఎటువంటి ఖర్చు అవసరం లేకుండా రాజధాని విశాఖకు తరలించాలని, అపుడు పెద్ద ఖర్చులేకుండా రాజధాని ఏర్పడినట్టవుతుందని జగన్ భావన. అదే అమరావతి కొనసాగించాలంటే మాత్రం చాలా డబ్బు కావాలి. అది సృష్టించే అవకాశం, అనుభవం రెండూ జగన్ కు లేవు.

ఇకపోతే విశాఖపట్నంలో సచివాలయం ఎక్కడ పెడతారు అన్న ప్రశ్నకు సమాధానం కోసం ఇపుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీలో నెంబరు 2 సాయిరెడ్డి సమాధానం ఇచ్చారు. పరిపాలన రాజధాని భీమిలి నియోజకవర్గంలోనే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బీమిలి అవంతి శ్రీనివాస్ నియోజకవర్గం. అంటే వైసీపీ నియోజకవర్గం. అందుకే వైజాగ్ లో పెడుతున్నా కూడా టీడీపీ గెలిచిన నాలుగు నియోజకవర్గాలను వదిలేసి వైసీపీ నియోజకవర్గంలో పెడతున్నారు. 

అయితే, నిరంతరం చంద్రబాబు విమర్శించకపోతే ముద్ద దిగని విజయసాయిరెడ్డి... తాజాగా బాబును విమర్శిస్తూనే... ప్రాంతీయ విద్వేషం రేపే వ్యాఖ్యలు చేశారు. ‘పరిపాలన రాజధానిని విశాఖకు తరలించాలనుకున్నాం. దీనికి చంద్రబాబు అడ్డుపుల్ల వేస్తున్నారు. ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం. దీన్ని అభివృద్ది చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పరిపాలన రాజధాని నిర్మించాలని జగన్ సంకల్పించారు’ అని ఆయన అన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వాడు అయితే... హుదూద్ తో సర్వనాశనం అయిన వైజాగ్ ను మునుపటి కంటే అందంగా తీర్చిదిద్దేవాడా? వైజాగ్ కు అంతర్జాతీయ సంస్థలను తెచ్చేవాడా? అక్కడ ఐటీని అభివృద్ధి చేసేవాడా? అసలు ఇవన్నీ చేసి ఉండకపోతే జనాలు మొన్న రాష్ట్రమంతటా వేయకపోయినా... వైజాగ్ లో అన్నిసీట్లు బాబుకే ఇచ్చేవారా? బాబు సంగతి వైజాగ్ వారికి తెలుసు. కానీ ఇలా రెచ్చగొట్టడం మాత్రం సాయిరెడ్డికే తెలుసు. ఏది ఏమైనా...తమదైన రియల్ ఎస్టేట్ ను జీరో నుంచి మొదలుపెట్టడం కోసమే వైసీపీ రాజధాని మీద కన్నేసిందని విమర్శలు మొదలయ్యాయి. మరి దాని సంగతి తేల్చాలి ముందు.