ఏపీ స్పీకర్ ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు?

August 12, 2020

ఏపీ స్పీకర్ తమ్మినేని రాజ్యాంగానికి కొత్త వివరణలు ఇస్తున్నారు. తనదైన కోణంలో తనలోని రెండు పాత్రలను వేరు చేశారు. ఎమ్మెల్యేగా వైసీపీ వ్యక్తి అట, సభలో ఉన్నపుడు స్పీకర్ గా వ్యవహరిస్తారట. ఇది ఆయనే స్వయంగా చెప్పారు. వాస్తవానికి ఇది రాజ్యాంగం పేర్కొన్న మౌలిక సూత్రానికి విరుద్ధం. ఆది నుంచి తనదైన శైలిలో వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుంటూ ఉంటే... సభలో మాత్రం న్యూట్రల్ ఉంటాను అంటే అది ప్రజలకు ఏ మాత్రం నమ్మకం భరోసా కల్పించదు. 

స్పీకర్ అయినంత మాత్రాన నోరు మూసుకుని కూర్చోవాలా? అంటూ తనదైన శైలిలో తమ్మినేని స్పందించడం అన్ని వర్గాలను విస్మయపరుస్తోంది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పదవిలో కూర్చున్న తర్వాత ఏ పార్టీకి చెందిన నేత అయినా... పార్టీలకతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంప్రదాయం ప్రకారమే కొనసాగింది. 

తమ్మినేని హయాంలో స్పీకర్ హోదా అర్థమే మారిపోయింది. సభలో మాత్రమే తాను స్పీకర్ అంటున్నారు. తమ్మినేని గారి వాదన రాజ్యంగ విరుద్ధం ఎలా అవుతుందో తెలుసా?

ఒక జడ్జి నిందితుడి ఇంట్లో భోజనం చేసి... సీట్లు వెళ్లాక కరెక్టు తీర్పు ఇస్తాను అంటే ఒప్పుకుంటారా? 

ఎన్నికల కమిషనర్ ఇంకో పార్టీలో చేరి.. సీట్లో ఉన్నపుడు నిష్పక్షపాతంగా ఉంటానంటే ఒప్పుకుంటారా?

సినిమా సెన్సార్ ఆఫీసర్ హీరోగా నటించి ఆ సినిమాకు ఆయనే సర్టిఫికెట్ ఇస్తానంటే ఒప్పుకుంటారా?

ఇదీ అంతే... తమ్మినేని గారు లోపలా స్పీకరే, బయటా స్పీకరే. ఆయన స్పీకరు అయిన తక్షణం పార్టీతో అనుబంధం కోల్పోతారు. బయటకు వస్తే ఒకలా లోపల ఒకలా ఉండరు. ఉండకూడదు. స్పీకర్ కు సభలోనే కాదు... బయట కూడా స్పీకర్ హోదాకు తగినట్టే భద్రత, సదుపాయాలు ఉంటాయి. అలాంటపుడు ఆయన బయట లోపల కూడా స్పీకరే.

స్పీకరుగా ఉంటూ ప్రతిపక్షంపైన విమర్శలు చేయడం, ఎన్నికల కమిషనర్ ని తిట్టడం, సొంత పార్టీని పొగడటం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ చేయకూడదు. అది ఆయన పదవికే ప్రమాదం. ఎవరైనా సుప్రీంకోర్టులో పోరాడితే తమ్మినేని సీతారాం పదవికే ముప్పు వస్తుంది.

Read Also

ఘనంగా కొనసాగుతున్న అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఝుమ్మంది నాదం పాటల పోటీలు
భారతీయ సంగీతం నృత్యాలకోసం అమెరికాలో 'సిలికానాంధ్ర సంపద'
అమరావతి రాజధానిగా కొనసాగించాలి -బుచ్చి రామ్ ప్రసాదు