రాజ‌న్న రాజ్యం వస్తే... ఏపీ మళ్లీ రెండు ముక్కలవుతుందా?

July 01, 2020

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మొద‌లు.. నిన్న‌మొన్న జ‌గ‌న్ పార్టీలో చేరిన సినీ న‌టుడు మోహ‌న్ బాబు వ‌ర‌కూ అంద‌రి నోట‌.. రాజ‌న్న రాజ్యం రావాలి.. రాజ‌న్న కొడుకు సీఎం కావాలంటూ అదే ప‌నిగా ప్ర‌జ‌ల్ని కోరుతున్నారు. ప్ర‌చారంతో హోరెత్తిస్తున్నారు. రాజ‌న్న రాజ్యం కావాల‌ని నిండు మ‌న‌సుతో కోరుకుంటున్న జ‌గ‌న్ కానీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు కానీ చెప్ప‌ని ఒక విష‌యాన్ని ఏపీ ప్ర‌జలు అస్స‌లు మ‌ర్చిపోకూడ‌దు.
రాష్ట్ర విభ‌జ‌న అన్న కాన్సెప్ట్ ఎప్పుడు మొద‌లైంద‌న్న విష‌యాన్ని కాసేపు ఆలోచిస్తే.. ఏపీ రెండు ముక్క‌లు కావ‌టం వెనుక వైఎస్ క‌నిపిస్తారు. ఇదెక్క‌డి వాద‌న? అంటూ క్వ‌శ్చ‌న్ చేయొచ్చు. కానీ.. చ‌రిత్ర‌ను ఒక్క‌సారి గుర్తుకు తెచ్చుకుంటే.. రాజ‌న్న రాజ్యంతోనే రాష్ట్రం రెండు ముక్క‌లు కావ‌టానికి బీజాలు ప‌డ్డాయ‌ని చెప్పాలి.
బాబు పాల‌న‌కు చెక్ చెప్ప‌టానికి.. నాటి అధికార టీడీపీ ఓటుబ్యాంకును ప్ర‌భావితం చేయ‌టానికి 2004 ఎన్నిక‌ల వేళ‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీ ఇచ్చిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌దు. టీఆర్ఎస్ తో క‌లిసి పోటీ చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రావ‌టం.. తెలంగాణ ఉద్య‌మం ఊపందుకోవ‌టం మొద‌లైంది. 2009 నాటికి ఉద్య‌మం మ‌రింత బ‌లోపేతం కావ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. రాజ‌న్న రాజ్యం కానీ అద్భుతంగా ఉంటే.. తెలంగాణ నినాదం 2009 ఎన్నిక‌ల నాటికి వెన‌క్కి వెళ్లాలి. అలా వెళ్ల‌లేదు స‌రిక‌దా.. వైఎస్ హ‌యాంలో జ‌రిగిన పాల‌న‌తో రెండు ప్రాంతాల్లో అస‌మాన‌త‌లు మ‌రింత ఎక్కువ అయ్యాయి.
పోతిరెడ్డిపాడు మొద‌లుకొని.. నిధుల కేటాయింపు మొద‌లుకొని.. సంక్షేమ కార్య‌క్ర‌మాల విష‌యంలో తెలంగాణ‌కు అన్యాయం జ‌రిగింద‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరిగింది. 2009లో మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చిన వైఎస్.. తెలంగాణ ఉద్య‌మాన్ని త‌న కంట్రోల్ లో ఉంచ‌గ‌లిగారు. కానీ.. లోలోన ర‌గుతున్న అగ్గిని ఆర్ప‌లేక‌పోయారు. దీంతో.. ఆయ‌న మ‌ర‌ణించిన వెంట‌నే తెలంగాణ నినాదం తెర మీద‌కు రావ‌ట‌మే కాదు.. చివ‌ర‌కురెండు రాష్ట్రాలుగా ముక్క‌లైన ప‌రిస్థితి. ఒక‌ప్పుడు 42 ఎంపీ స్థానాల‌తో బ‌లంగా ఉన్న ఏపీ.. ఈ రోజు పాతిక స్థానాల‌తో ఏపీ.. 17 స్థానాల‌తో తెలంగాణ చిన్న చిన్న రాష్ట్రాలుగా మారిపోయిన దుస్థితి.
బాబుకు చెక్ పెట్ట‌టానికి.. ఆయ‌న‌కు రాజ్యాధికారం ద‌క్క‌కుండా ఉండ‌టానికి ఎత్తుగ‌డ వేసిన వైఎస్ పుణ్య‌మా అని ఏపీ రెండు ముక్క‌లైన ప‌రిస్థితి. ఈ రోజు మ‌ళ్లీ రాజ‌న్న రాజ్యం కావాల‌ని కోరుకుంటున్న జ‌గ‌న్ కానీ.. ఆయ‌న అభిమానులు.. మోహ‌న్ బాబు లాంటి సినీ ప్ర‌ముఖులు.. జ‌గ‌న్ జ‌మానాలో ఏపీ మ‌రో రెండు ముక్క‌లు కాద‌న్న హామీ ఇవ్వ‌గ‌ల‌రా? అంతవ‌ర‌కూ ఎందుకు?.. ఏపీ రెండు ముక్క‌లు కావ‌టానికి రాజ‌న్న రాజ్యం కార‌ణం కాదా? అన్న మాట‌కు సూటిగా స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌రా?