ఉద్యోగుల మెడపై జగన్‌ కత్తి!

May 27, 2020

ఏపీఎన్జీవో రద్దుకు వ్యూహం?
ఆ సంఘానికి షోకాజ్‌ నోటీసు
గతంలో కౌన్సిల్‌ భేటీకి నాటి సీఎం
చంద్రబాబును పిలిచినందుకే!
వైఎస్‌ సహా ప్రతి ముఖ్యమంత్రీ
ఆ సమావేశాలకు వెళ్లినవారే
నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిని కాకుండా ప్రభుత్వ ఉద్యోగులే అడ్డుకున్నారని ప్రస్తుత సీఎం జగన్‌కు పీకలదాకా కోపం ఉంది. 2014లో వారు సమైక్యాంధ్ర ఉద్యమం చేపట్టకుండా ఉంటే ప్రజలు తనకే ఓటేసి ఉండేవారన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు. . ఉద్యమం జరుగుతున్న సమయంలో.. సమైక్యాంధ్రకు జగన్‌ మాత్రమే కట్టుబడి ఉన్నారని.. చంద్రబాబుది పచ్చి అవకాశవాదమని బహిరంగంగా ప్రకటన చేయాలని తనను కలవడానికి వచ్చిన ఏపీఎన్‌జీవో నేతలకు షరతు విధించారు. అలాగైతేనే వారు తలపెట్టిన సమైక్యాంధ్ర సభకు వస్తానని చెప్పారు. అందుకు ఎన్‌జీవో నేతలు అంగీకరించలేదు. ఉద్యమానికి రాజకీయ రంగు పులమొద్దని స్పష్టం చేసి వచ్చేశారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం కాగానే.. వారు అడగకుండానే ఫిట్‌మెంట్‌ పెంచారు.. అడగకుండానే డీఏలు ఇచ్చారు.. పీఆర్‌సీ అమలు చేశారు.. వారు అడగకముందే కొత్త వేతన సవరణ సంఘాన్ని కూడా నియమించారు. అది ప్రాథమిక నివేదిక ఇవ్వకముందే 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక పీఆర్‌సీ సంగతి తర్వాత.. కనీసం మూడు డీఏల అమలుకు కూడా అతీగతీ లేదు. డిసెంబరుదాకా పీఆర్‌సీ నివేదిక వచ్చే పరిస్థితి లేదు. అయినా ఏపీ ఎన్‌జీవో సంఘం నోరుమెదపడం లేదు. దాని అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి ఒకప్పుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డికి గట్టి మద్దతుదారు. ఇప్పుడు జగన్‌ను సమర్థిస్తున్నారు. ఇంతలోనే సీఎం నిజస్వరూపం బయటపడడంతో నోరెత్తడం లేదు. అదేమిటంటే... ఎన్‌జీవోలు తమ జనరల్‌ కౌన్సిల్‌ సదస్సుకు అప్పటి సీఎం చంద్రబాబును ఆహ్వానించారట! ఇది నిబంధనలకు విరుద్ధమట..! ఆ సంఘం గుర్తింపును ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), సీఎం కార్యాలయం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ షోకాజ్‌ నోటీసు జారీచేశారు. ఎన్‌జీవో సంఘంలో సభ్యత్వంలో లేని ఒకానొక ఉద్యోగి చేసిన ఫిర్యాదు దీనికి ఆధారమట! జగన్‌ సమర్థకులైన ఎన్‌జీవో నేతలు బిత్తరపోయారు.

వాస్తవానికి ఉద్యోగుల హక్కులకు గొడుగు పట్టేది... వారి తరఫున గళం వినిపించేది ఏపీఎన్‌జీవో సంఘం! ఉద్యోగుల విషయాలపైనే కాదు.. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ వారిది పాత్ర! అలాంటి సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. చంద్రబాబు హయాంలో జరిగిన అన్ని రకాల కార్యకలాపాలకు ‘సిట్‌’ ఏర్పాటు చేసిన ప్రభుత్వం... చివరకు ఆయన్ను తమ సదస్సుకు ఆహ్వానించారంటూ ఏపీ ఎన్జీవో సంఘంపైనా కత్తి కట్టింది. కర్నూలుకు చెందిన ఒక ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదును సాకుగా చేసుకుని షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. ప్రభుత్వం ద్వారా తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు ముఖ్యమంత్రితో, మంత్రులతో సన్నిహితంగా ఉండటం.. వారితో ఉద్యోగ సంఘాలు సత్సంబంధాలు నెరపడం సహజం. విన్నపాలకు విలువలేనప్పుడు ఆందోళనలు, సమ్మెలకూ సిద్ధమవుతారు. 2018లో ఏపీఎన్‌జీవో అసోషియేషన్‌ తిరుపతిలో సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అప్పటి సీఎం చంద్రబాబుతోపాటు పలువురు మంత్రులను ఆహ్వానించింది. తాము నోరుతెరచి విజ్ఞప్తి చేయకముందే కొత్త పీఆర్‌సీని ఏర్పాటు చేయడమే దీనికి కారణం. చంద్రబాబును సదస్సుకు పిలిచి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్‌ ప్రభుత్వం ఇప్పుడు దీనిని తప్పుపట్టింది. సభ్యులు కాని వారిని అసోసియేషన్‌ మీటింగ్‌కు పిలిస్తే ఆ సంఘం గుర్తింపును రద్దుచేయొచ్చని 2001 జూన్‌ 22న ఇచ్చిన జీవో 264లో పేర్కొన్నారు. ఆ నిబంధనను జగన్‌ తెరపైకి తెచ్చి ఏపీఎన్‌జీవో సంఘాన్ని జీఏడీ సంజాయిషీ అడిగింది. దీంతో పాటు మీ సంఘంలో సభ్యులెంత మంది ఉన్నారు?  బైలాస్‌, ఆడిట్‌ తదితర వార్షిక నివేదికలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించింది. కర్నూలు జిల్లాలో ఏపీఎన్‌జీవో సభ్యుల సంఖ్య వివరాలు జీఏడీకి తెలపలేదని, జాబితాను తారుమారు చేశారని ఆరోపించింది. అలాగే ఏపీఎన్‌జీవోకు ప్రభుత్వమిచ్చిన స్థలాలు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయని... నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరణ ఇవ్వాలంటూ ఫిబ్రవరి 14న జీఏడీ ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు/ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. నిజానికి సర్కారు అసలు టార్గెట్‌ ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే పరుచూరి అశోక్‌బాబే. ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన.. కొన్నాళ్ల క్రితమే రిటైరయ్యారు. చంద్రబాబు ఆహ్వానం మేరకు టీడీపీలో చేరారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా చంద్రబాబు ఆయనకు శాసనమండలి సభ్యత్వమిచ్చి గౌరవించారు.

జగన్‌ అధికారంలోకి వచ్చాక చంద్రశేఖర్‌రెడ్డి బృందం పలుదఫాలు ఆయన్ను కలిసి తమ సమస్యలు, డిమాండ్లు చెప్పుకోవడానికి ప్రయత్నించింది. సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. దీంతో తమ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. లంచ్‌ అవర్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించారు. ఈలోపు మరో ఉద్యోగ సంఘానికి (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం-ఏపీజీఈఏ).. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చింది. దీనిపై ఇతర సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆ తర్వాత సచివాలయ ఉద్యోగ సంఘంతో పాటు ఇతర సంఘాల ప్రతినిధులకు సీఎం దర్శనభాగ్యం లభించింది. ఆయా సంఘాల నేతలు గత ప్రభుత్వంతో వ్యవహరించిన తీరుపై వివరణ ఇచ్చుకున్నారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మూడు రాజధానుల ఏర్పాటు అనుచితం, అన్యాయమని తెలిసినా.. సీఎం ప్రకటనను అన్ని సంఘాలూ పోటీలుపడి మరీ స్వాగతించాయి. డీఏలు పెండింగ్‌లో ఉన్నా, పీఆర్‌సీ నివేదిక ఆలస్యమవుతున్నా, ఉద్యోగుల సాధక బాధకాలు పట్టించుకోకుండా ఏకపక్షంగా కార్యాలయాలు తరలించాలని నిర్ణయించినా అవి ప్రభుత్వానికి సహకరిస్తున్నాయి. అయినప్పటికీ... ‘మీ సంఘాన్ని ఎందుకు రద్దు చేయకూడదు’ అంటూ ఏపీఎన్‌జీవో సంఘానికి  తాఖీదు ఇవ్వడం గమనార్హం. నిజానికి కర్నూలుకు చెందిన ఓ ఉద్యోగి చేసిన ఆరోపణలను పట్టుకుని ఈ ఆదేశాలిచ్చింది. ఈయనపై పలు క్రిమినల్‌ కేసులున్నాయి. ఎన్‌జీవో సంఘంలో సభ్యుడు కాదు. గతంలోనూ అనేక అసంబద్ధ ఆరోపణలు చేశారు. ఏపీఎన్‌జీవో రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. జీఏడీ అధికారులు ఎప్పుడైనా వాటిని పరిశీలించుకోవచ్చు. అయితే ఎన్‌జీవోసంఘంపై ఉక్రోషంతోనే షోకాజ్‌ నోటీసు జారీచేశారని స్పష్టమవుతోంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహా ప్రతి ముఖ్యమంత్రీ ఏపీఎన్‌జీవో కౌన్సిల్‌ సమావేశాలకు హాజరైనవారే. ఇటీవల గుర్తింపు పొందిన ఏపీజీఈఏ నాయకుడు కె.రామసూర్యనారాయణ కూడా గతంలో అనేకసార్లు సీఎంను, మంత్రులను సమావేశాలకు ఆహ్వానించారు. మరి వారి గుర్తింపు కూడా రద్దు చేస్తారా అని ఏపీఎన్‌జీవో సంఘం నిలదీస్తోంది. కొందరు ఉన్నతాధికారులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారని అది ఆక్షేపిస్తున్నా.. ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్న విషయం దానికి తెలియకపోలేదు. కాకపోతే ఇంకో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి.. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా కలిసి సాగాలని భావిస్తోంది.

RELATED ARTICLES

  • No related artciles found