ఏపీ ఎన్నార్టీ కొత్త ఛైర్మన్ ఎవరంటే...

August 05, 2020

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన ఏపీఎన్నార్టీ (ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు పీపుల్) సొసైటీకి తొలి ఛైర్మన్ గా పనిచేసిన డాక్టర్ వేమూరి రవికుమార్ రాజీమానా చేయడంతో ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఆ పదవికి సరైన వ్యక్తికోసం జగన్ వెతుకుతున్నారు. ఇప్పటికే ఎంపిక పూర్తయ్యిందని తెలుస్తోంది. మేడపాటి వెంకట్ రెడ్డిని ఏపీ ఎన్నార్టీ ఛైర్మన్ గా నియమించబోతున్నారట. ఇక అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయి.

కాలిఫోర్నియాకు చెందిన వెంకట్ రెడ్డి... సౌమ్యుడు. కలుగుపుగోలు మనిషి అని, ఆయన ఈ పదవికి సరైన ఎంపిక అని కొందరు అంటున్నారు. వాస్తవానికి ఈ సంస్థ చంద్రబాబు చొరవతో ఏర్పాటైంది. తెలుగు వారు ఎప్పటి నుంచో ఉంటున్నా... వారికంటూ ఏ హక్కులు లేకి ద్వితీయ పౌరుల్లా ఉండేవారు. ఏపీ ఎన్నార్టీ వచ్చాక డాక్టర్ రవి కుమార్ కృషితో ఎన్నారైలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం పలు సదుపాయాలు కల్పించింది. తిరుమలలో ప్రత్యేక దర్శనం కల్పించింది. పెట్టుబడి పెట్టాలనుకునేవారికి రాచ బాట పరిచింది. వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు వారి ఐక్యతకు తోడ్పడింది.

డాక్టర వేమూరి రవి కృషితో అమరావతిలో ఎన్నారై టవర్ నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది పూర్తయితే ఎన్నారైలకు ఎంతో ఉపకరిస్తుంది. కాకపోతే దీనిపై ప్రభుత్వం ఇంకా ఏ ముందడుగు వేయలేదు. దీనికి ఇప్పటికే ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది. అమరావతిలో అన్ని ప్రాజెక్టులతో పాటు ఎన్నారై ఐకానిక్ టవర్ పనులు కూడా ఆగిపోయాయి. మరి కొత్త చైర్మన్ వచ్చాక అది కొనసాగిస్తారా... చంద్రబాబు హయాం ప్రాజెక్టు అని ఆపేస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.