జగన్ టూర్ ఎఫెక్ట్ - ఏపీఎన్నార్టీ కి కొత్త చైర్మన్

August 06, 2020

ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన తెలుగు వారి సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన ఏపీఎన్నార్టీ సొసైటీకి కొత్త ఛైర్మన్ వచ్చారు. వెంకట్ ఎస్. మేడపాటిని ఏపీఎన్నార్టీ ఛైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎన్నార్టీ తెలుగు ఎన్నారైలకు సంబంధించి అన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. వెంకట్ దీనికి రెండో ఛైర్మన్. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు (ఏపీఎన్ఆర్టీ) సొసైటీ ఛైర్మన్, సలహాదారుగా నియమితులైన వెంకట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్నారైలలో పేరు పొందారు. తెలుగు వారికి సుపరిచితులే. రవి వేమూరి దీనికి మొదటి ఛైర్మన్ గా పనిచేస్తూ... విదేశీ పెట్టుబడుల వ్యవహారాలను ఏపీ ఎన్నార్టీ పర్యవేక్షించేలా తీర్చిదిద్దారు. దీంతో ఏపీఎన్నార్టీ సేవలు, పనులు విసృతం అయ్యాయి.

రవి వేమూరి పదవీ కాలం ముగియకున్నా... ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన నైతిక ధర్మాన్ని పాటించి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే రవి వేమూరి రాజీనామా చేయడంతో ఆ పోస్టు ఇంతకాలం ఖాళీగా ఉంది. ఆర్పీ సిసోడియా ఇంఛార్జిగా వ్యవహరిస్తూ వచ్చారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో వెంటనే కొత్త ఛైర్మన్ ను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం స్వాతంత్య్ర దినోత్సవాలు ముగిసిన అనంతరం వైఎస్ జగన్ అమెరికా బయలుదేరి వెళ్తారు.