మలేషియాలో భారత హై కమిషనర్ ని కలసిన APNRT అధ్యక్షులు శ్రీ వెంకట్ మేడపాటి

August 06, 2020

కౌలాలంపూర్: మలేషియాలోని భారత హై కమిషనర్ మ్రిదుల్ కుమార్ ని APNRT అధ్యక్షులు శ్రీ వెంకట్ మేడపాటి ఆధ్వర్యంలో ఏపీఎన్ఆర్టీ బృందము కలిసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవాసాంధ్రులు ఎక్కడ ఉన్నా వారి సంక్షేమ మరియు అభివృద్ధి కొరకు కృషి చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ ద్వారా వివిధ కారణాల వల్ల అక్రమ వలసదారులు గా మారిన ఆంధ్రుల ని తిరిగి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేందుకు తాము వచ్చినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా వారు మలేషియా ప్రభుత్వం ప్రకటించిన ఆమ్నెస్టీ అమలు విషయంలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు గురించి భారత హై కమిషనర్ కు దృష్టికి తెచ్చారు. సకాలంలో ఎగ్జిట్ పర్మిట్ అందకపోవటం, అక్రమ వలసదారులు చాలామంది అవసరమైన పత్రాల ని కలిగి ఉండకపోవటం, మలేషియా ప్రభుత్వం విధించిన జరిమానా ఎక్కువగా ఉండటం, ఆమ్నెస్టీ ద్వారా బయట పడదామనుకొనే వారిని కొన్ని సందర్భాలలో స్థానిక పోలీసులు అరెస్టు చేయడం మొదలైన క్షేత్రస్థాయి సమస్యల్ని భారత హైకమిషనర్ దృష్టికి తెచ్చారు. ఇలాంటి నిస్సహాయ బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిమానా చెల్లించడం, విమాన టిక్కెట్లు చెల్లింపు, వీసా ఫీజు చెల్లింపు, ఆంధ్ర ప్రదేశ్ లో వారు తమ సొంత ఇంటికి చేరే వరకు అయ్యే ఖర్చు భరించడం, మలేషియాలోని తెలుగు సంఘాల సమన్వయ ద్వారా అక్రమ వలసలు గా గుర్తించబడిన ఆంధ్రులకి సహాయం చేయటం, తిరిగి ఎవరైనా విదేశాలకు సక్రమంగా వెళ్లేందుకు కావలసిన నిపుణతలు అందించేందుకు చేసిన ఏర్పాట్ల గురించి ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు వివరించారు.
దేశము లో నే మలేషియా ఆమ్నెస్టీ విషయంలో మొట్టమొదట స్పందించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని, అక్రమ వలసదారుల విషయంలో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన రక్షణ చర్యలు దేశానికి నమూనా లాంటివని మృదుల్ కుమార్ పేర్కొన్నారు. ఏపీఎన్ఆర్టీ, భారత హై కమిషన్, మలేషియా తెలుగు సంఘాలు ఉమ్మడిగా చేపట్టిన ఈ కార్యక్రమం సాధించే ఫలితాలను బట్టి బెస్ట్ ప్రాక్టీసలని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మిగతా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా కూడా ఈ ప్రాక్టీస్ లని అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా భారత హై కమిషనర్ పేర్కొన్నారు. వివిధ కారణాల వలన అక్రమ వలసదారులు గా మలేషియాలో ఉంటున్న ఆంధ్రులు, తక్షణం స్పందించి మలేషియాలోని తెలుగు సంఘాలను గాని, భారత హై కమిషన్ ను గాని సంప్రదించాలని ఏపీఎన్ఆర్టీ అధ్యక్షులు వెంకట్ మేడపాటి కోరారు. సక్రమమైన పద్ధతుల ద్వారానే ఏ దేశం లోకి ప్రవేశించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. 

APNRT అధ్యక్షులు శ్రీ వెంకట్ మేడపాటి బృందము లో APNRT సీఈఓ శ్రీ.భవాని శంకర్ మరియు డైరెక్టర్ శ్రీ రాజ శేఖర్ తదితరులు ఉన్నారు 

RELATED ARTICLES

  • No related artciles found