హైప్రొఫైల్ మర్డర్ - చంపింది పెళ్లామేనట

July 10, 2020

అనుమానాలు నిజ‌మ‌య్యాయి. సీనియర్ పొలిటీషియన్, ఏపీ మాజీ గవర్నర్ తివారీ కొడుకు రోహిత్ శేఖ‌ర్ అకాల మ‌ర‌ణం ప‌లు సందేహాలు వ్య‌క్తం కాగా.. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దాన్ని నిజం చేసింది. దీంతో మొద‌ట్లో అనారోగ్యంతో రోహిత్ మ‌ర‌ణించిన‌ట్లుగా అనుకున్నా.. అత‌డిది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని.. అనుమాన‌స్ప‌ద మ‌ర‌ణంగా తేల్చారు.
దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు తాజాగా రోహిత్ స‌తీమ‌ణి అపూర్వ శుక్లాను అదుపులోకి తీసుకున్నారు. గ‌డిచిన మూడు రోజులుగా ఆమెను విచారిస్తున్న పోలీసులు.. పొంత‌న లేని స‌మాధానాలు చెబుతుండ‌టంతో.. భ‌ర్త మ‌ర‌ణానికి ఆమె కార‌ణంగా భావించారు. దీంతో విచార‌ణ‌ను ముమ్మ‌రం చేసిన పోలీసుల‌కు ఆమె తాను చేసిన హ‌త్య‌ను చెప్పేసిన‌ట్లుగా చెబుత‌న్నారు.
వైవాహిక జీవితంలో వ‌చ్చిన గొడ‌వ‌లే వల్లే భ‌ర్త‌ను హ‌త‌మార్చిన‌ట్లుగా అపూర్వ వెల్ల‌డించారు. తాగి వ‌చ్చిన భ‌ర్త మ‌త్తులో ఉన్న‌ప్పుడు.. ఊపిరి ఆడ‌కుండా చేయ‌టం ద్వారా హ‌తమార్చిన‌ట్లుగా పేర్కొన్న‌ట్లు తెలిసింది. పెళ్లి అయిన మొద‌టి రోజు నుంచి త‌మ మ‌ధ్య సఖ్య‌త లేద‌ని.. ఆ విభేదాలు అంత‌కంత‌కూ పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది.
రోహిత్ మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఇంటి స‌మీపంలోని సీసీ కెమెరాలు ప‌ని చేయ‌క‌పోవ‌టం.. వేరే వ్య‌క్తులు ఇంట్లో వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌టంతో.. పోలీసుల అనుమానాలు అపూర్వ మీద‌నే ఉన్నాయి. ఈ కోణంలో విచార‌ణ చేసిన వారికి రోహిత్ ను అపూర్వే హ‌త‌మార్చిన విష‌యాన్ని ఆమె ఒప్పుకోవ‌టంతో.. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడిపోయింది.