ఆ యాప్ గంటల్లో సూపర్ హిట్ ... అయినా ఆపేశారు

August 15, 2020

ఇప్ప‌టికి ఉన్న ద‌రిద్రాలు స‌రిపోవ‌న్న‌ట్లుగా తాజాగా మ‌రో ద‌రిద్రం వ‌చ్చి చేరింది. ఆడదాని మానానికి రక్షణ లేని ఓ దుర్మార్గ‌పు యాప్ గురించి వివ‌రాలు తెలిస్తే వామ్మో అనాల్సిందే. ఇప్ప‌టికే ప‌లు ర‌కాలుగా లైంగిక వేధింపుల‌ను ఎదుర్కొంటున్న మ‌హిళ‌ల‌కు ఈ దుర్మార్గ‌పు యాప్ కార‌ణంగా ఇబ్బందులు మ‌రింత పెర‌గ‌టం ఖాయం.
సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా ఉండే మ‌హిళ‌ల్ని సైతం న‌గ్నంగా చూపించే ఈ రాక్ష‌స యాప్ పేరు డీప్ న్యూడ్‌. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప‌ని చేసే ఈ యాప్ తో ఫ‌న్ మ‌స్తుగా ఉంటుందని చెబుతున్నారు. నిజ‌మే.. వాడేవాడికి ఫ‌న్.. మిగిలిన వారికి మాత్రం ఏడుపే. వినోదం కోసం తామీ యాప్ ను త‌యారు చేసిన‌ట్లుగా చెబుతున్నా.. దీన్ని వాడే వారంతా దుర్మార్గ‌పు ప‌నుల‌కే వినియోగిస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
త‌మ‌ను తాము ఎంత‌గా స‌మ‌ర్థించుకున్నా.. నెటిజ‌న్లు మాత్రం ఈ యాప్ త‌యారీ దారుల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి వాటితో మంచి కంటే చెడే ఎక్కువ‌గా క‌లుగుతుంద‌ని.. ఇదెంతో ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌ని చెబుతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ యాప్ ను నెట్లో పెట్టారో లేదో.. కాసేప‌టికే 5 ల‌క్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. అయితే..దీనిపై పెల్లుబుకుతున్న ఆగ్ర‌హంతో ఈ యాప్ ను నెట్ నుంచి తొల‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.