బయట విమర్శలు

August 13, 2020
CTYPE html>
లోన పొగడ్తలు
పోలవరంపై జగన్‌ రెండు నాల్కల ధోరణి
ప్రాజెక్టు పనుల్లో అవకతవకల్లేవు
గతంలో నిబంధనల ప్రకారమే పనుల అప్పగింత
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదిక
సమీక్షల పేరుతో వందల కోట్లు దుర్వినియోగం
చంద్రబాబుపై ముఖ్యమంత్రి ఆరోపణలు
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టులో అవినీతి అంటూ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ పదేపదే చేస్తున్న ఆరోపణలు అవాస్తవమేనని తేలిపోయింది. ‘రివర్స్‌ టెండర్‌’ బాటపట్టడానికి కారణంగా చెబుతున్న ‘ప్రజాధనం దుర్వినియోగం’ అంతా ఉత్తుత్తదేనని స్పష్టమైంది. ఇన్నాళ్లు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని జగన్‌ ప్రభుత్వమే అంగీకరించింది. ప్రాజెక్టు పనుల కాంట్రాక్టుకు సంబంధించి నిబంధనలపరంగా ఎలాంటి ఉల్లంఘనలూ లేవని తేల్చిచెబుతూ కేంద్రానికి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఆమోదముద్ర తీసుకున్నాకే అన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు జగన్‌ ప్రభుత్వం గత నవంబరులోనే తమకు లేఖ రాసినట్లు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ అనూప్‌ శ్రీవాత్సవ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) దృష్టికి తీసుకెళ్లారు. సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు లేవనెత్తిన పలు అంశాలపై పీఎంవో రాసిన లేఖకు జలశక్తి శాఖ ఈ మేరకు జవాబిచ్చింది. అయినా మాజీ సీఎం చంద్రబాబుపై జగన్‌ తన తప్పుడు ఆరోపణలు కొనసాగిస్తున్నారు. పోలవరంపై సమీక్షలకు వందల కోట్లు ఖర్చుచేశారని ఇటీవల ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు చెప్పారు. ప్రాజెక్టులో ప్రధాన పనులన్నీ 67 శాతం వరకు పూర్తయ్యాయని, మిగిలిన 23 శాతం పనులు పూర్తి చేయడానికి అడ్డంకులను అధిగమించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పనుల డిజైన్లకు అనుమతులు పొందడం ఆలస్యం కారాదని, వీటిని సాధించేందుకు ఒక అధికారిని ఢిల్లీలో నియమించాలని సూచించారు. చంద్రబాబు హయాంలో ఏకంగా 14 మందితో కూడిన ఇంజినీరింగ్‌, పునరావాస అధికారుల బృందం ఢిల్లీలో మకాం వేసి.. కేంద్రం కొర్రీలకు ఎప్పటికప్పుడు సమాధానాలిస్తూ వచ్చింది. జగన్‌ అధికారంలోకి రాగానే వారందరినీ వెనక్కి పిలిపించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరిట ఏడాది పాటు పనులు ఆపేసి ఇప్పుడు ప్రత్యేక అధికారిని నియమించాలని అంటున్నారు. ప్రధాన డ్యామ్‌కు ఎదురుగా నిర్మించే నాలుగు వరుసల రహదారితో కూడిన ఐకాన్‌ బ్రిడ్జిని నిర్మించాలని చంద్రబాబు ప్రతిపాదించారు. అది శుద్ధ వేస్టని జగన ఆనాడు తిట్టిపోశారు. ఇప్పుడు ఆసక్తి చూపుతూ.. దానికి వైఎస్‌ఆర్‌ గేట్‌వేగా నామకరణ చేయాలని సూచించడం గమనార్హం.