ఇదేం విలీనం? సంస్థ కాదట.. సిబ్బంది మాత్రమేనట!

May 22, 2020

ఇదేం విలీనం?
సంస్థ కాదట.. సిబ్బంది మాత్రమేనట!
పాత పెన్షన్‌ విధానానికి నో
ఇక మాకేం ఒరిగినట్లు?
ఆర్టీసీ కార్మికుల వేదన
ప్రభుత్వంలో కలిసినా కానరాని సంతృప్తి

ఏపీఎస్‌ఆర్‌టీసీ కార్మికులు ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉన్నారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశం లేకపోవడంతో సిబ్బందిని మాత్రమే విలీనం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. దానికి తగినట్లు ఈ నెలలో వారిని ప్రభుత్వంలో కలిపేశామన్నారు. ఏపీఎస్‌ఆర్‌టీసీ పేరును ప్రజారవాణా సంస్థ (పీటీడీ)గా మార్చామన్నారు. ఇంతకుమించి తమకేం ఒరిగిందని సిబ్బంది దిగాలుగా ఉన్నారు. ప్రభుత్వంలో విలీనమైతే ప్రభుత్వ సిబ్బందికి ఒనగూరే సకల సౌకర్యాలు తమకు వర్తిస్తాయని వారు ఆరు నెలలుగా ఊహలపల్లకీలో విహరించారు. ముఖ్యంగా పింఛను విధానం మారుతుందని.. పాత పింఛను పద్ధతి అమలైతే తమకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని భావించారు. కానీ అంతా తలకిందులైంది. కొత్త సంవత్సరం వచ్చేసింది.. ఆర్టీసీ పేరు పీటీడీగా మారింది.. అంతకు మించి ఇంకేమీ దక్కలేదని వారు వాపోతున్నారు. ‘మనకు పెన్షన్‌ ఇవ్వరా..? మరైతే విలీనంతో మేలేం జరిగినట్లు’ అని ప్రశ్నిస్తున్నారు. వారిని ఎలా సమాధానపరచాలో యూనియన్‌ నేతలకు అర్థం కాక తలపట్టుకుంటున్నారు.
నిజానికి విలీన ప్రక్రియ మొదలుకాగానే.. కార్మిక సంఘాలు పదే పదే కమిటీలకు, యాజమాన్యానికి పలు సూచనలతో వినతులిచ్చాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్నీ వర్తింపజేయాలని.. ముఖ్యంగా పాత పెన్షన్‌ అమలు చేయాలని ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ సహా అన్ని కార్మిక సంఘాలు, సూపర్‌ వైజర్ల అసోసియేషన్లు పాత పెన్షన్‌ అమలు చేయాలని విలీన కమిటీని కోరాయి. అది చేయకపోతే విలీనం జరిగినా ఉపయోగం ఉండబోదని స్పష్టంచేశాయి. ఇవేవీ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. పాత పెన్షన్‌ అమలు సాధ్యం కాదని, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)కే  అవకాశం ఉంటుందని ఉన్నతాధికారులు కొందరు కార్మిక సంఘాల నేతలకు చెప్పేశారు. నిజానికి జగన్‌ తన ఎన్నికల ప్రచార సమయంలో.. అధికారంలోకి వచ్చిన నెలలోనే సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానం తెస్తానని ప్రకటించారు. ఏడు నెలలు గడచినా అతీగతీ లేదు. ఆర్టీసీ కార్మికులకు సీపీఎస్‌ తప్పదని చెప్పడంతోనే ఆ విధానాన్ని జగన్‌ రద్దుచేయరన్న విషయం తేలిపోయింది.


రహస్య నివేదిక..
విలీన కమిటీ ఏం చెప్పిందో ప్రభుత్వం ఇంతవరకు బయటపెట్టలేదు. యూనియన్‌ నేతలకేమైనా చూపించిందేమో తెలియడం లేదు. వారు కూడా పెదవి విప్పడం లేదు. ‘ఏదో ఆశిస్తే మరేదో జరిగింది.. రహస్య నివేదికతో అంతా అయోమయంగా ఉంది’ అని అంటున్నారే తప్ప.. కార్మికులకు సమాధానం చెప్పలేక పోతున్నారు. కార్మికులు, సిబ్బంది మాత్రం పాత పెన్షన్‌ అమలు చేయాల్సిందేనని, 30 ఏళ్లకు పైగా కష్టపడ్డ తమకు జీవితం చివరి దశలో భరోసా ఉండాల్సిందేనంటున్నారు. అది లేకపోతే ఇతరత్రా అన్నీ కార్పొరేషన్‌ ద్వారా దక్కుతున్నాయని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నారు. ‘ఆర్టీసీలో కొనసాగిస్తున్న ఈపీఎస్‌ కావాలా.? ప్రభుత్వంలో విలీనం అయ్యాక సీపీఎస్‌ కావాలా.? ఏదో ఒకటి ఎంచుకోండి’ అని తాజాగా సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వం నిరుపేదలకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్‌ కన్నా ఆర్టీసీ రిటైర్డ్‌ సిబ్బందికి వస్తున్న పెన్షన్‌ తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంలో విలీనం తర్వాత పెన్షన్‌ తప్పక వస్తుందని వారు ఆశించారు. కానీ ఏదీ లేకుండా పోతోందని వాపోతున్నారు. ఆర్థిక భరోసాలేని ఉద్యోగం కార్పొరేషన్‌ అయితే ఏంటి.? ప్రభుత్వం అయితే ఏంటి.? ఏదైనా ఒక్కటే కదా.? అని ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మారుతున్న ఈ సిబ్బందికి ఉన్న సౌకర్యాల్లో అధికారులు కోత పెడుతున్నారు. అదనంగా కావాలని అడిగితే ఉన్నవి కూడా తగ్గించేస్తున్నారు. ఆర్టీసీలో సిబ్బందికి వైద్యం ఖర్చు ఎంతైనా చేస్తున్నారు.. పీటీడీలో కేన్సర్‌ పేషెంట్లకు ఖర్చు ఎక్కువవుతోందంటూ మధ్యలో ఆపేస్తున్నారు. ఫలితంగా కార్మికుడు జీవితంపై ఆశలు వదులుకోవలసి వస్తోంది. ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీ అధికారులకు ప్రమోషన్లు, రెగ్యులైజేషన్లలో బాగానే మేలు జరిగింది. సిబ్బంది విషయానికి వచ్చేసరికి.. నిబంధనలు సవరించేశారు. అదేమని అడిగితే విలీనం సంపూర్ణమయ్యాక అన్నీ జరుగుతాయని దాటవేస్తున్నారు. కార్మికుల సొంత డబ్బుతో నడిచే ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటీ మూసివేతకు విలీనం బీజం వేస్తోంది. భవిష్యత్తులో సిబ్బంది ఆర్థిక అవసరాలు తీరే మార్గమే కనిపించడం లేదు. సంస్థ విలీనం కావడంలేదు.. సిబ్బంది వరకే జరుగుతున్నప్పుడు మోటారు వాహన చట్టం, ఫ్యాక్టరీ చట్టాల కింద పనిచేస్తున్న సిబ్బందిపై ‘కోడ్‌ ఆఫ్‌ డిసిప్లిన్‌’ అమలు చేస్తామనడం గమనార్హం.


ప్రభుత్వ బస్సు.. ప్రైవేటు డ్రైవరు..
ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనం జరిగిపోయింది. ఆర్టీసీ పీటీడీగా మారిపోయింది. కానీ పీటీడీలో డ్రైవర్లుగా ఔట్‌సోర్సింగ్‌వారిని నియమించేందుకు సంస్థ సిద్ధమైంది. ఈ ఏడాది పీటీడీ విడుదల చేసి మొదటి ఉత్తర్వు నుంచే బయటి వ్యక్తులను నియమించుకునే ప్రక్రియ మొదలైంది. బస్సు నడిపే డ్రైవర్‌ మొదలుకొని పీటీడీ బాస్‌ పేషీ వరకూ పర్మినెంట్‌ సిబ్బందిని దూరం పెట్టే చర్యలు మొదలయ్యాయి. ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్లను తీసుకునేందుకు ఆపరేషన్స్‌ విభాగం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా రెండు వారాల పాటు ఆర్టీసీ డ్రైవర్లుగా పనిచేసేందుకు లైసెన్స్‌, అనుభవం ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఇటీవల తెలంగాణలో కార్మికుల సమ్మె సందర్భంగా ఇదే విధంగా తీసుకుంటే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇదే పరిస్థితి వస్తే ప్రయాణికుల భద్రతకు ఎవరు భరోసా ఇస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. కార్మికులు సైతం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. పీటీడీకి ఒక్కసారి చెడ్డపేరు వస్తే ప్రయాణికులు శాశ్వతంగా దూరమవుతారని.. ప్రైవేటు బస్సులనే ఆశ్రయిస్తారని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 22వేల మంది డ్రైవర్లు పీటీడీలో ఉన్నారని.. వారితోనే తాత్కాలికంగా డబుల్‌ డ్యూటీలు చేయించవచ్చని,  తర్వాత శాశ్వతంగా రెగ్యులర్‌ రిక్రూట్‌ చేసుకోవాలని కోరుతున్నారు. పీటీడీలో డ్రైవర్‌, కండక్టర్‌ దాదాపు ఒకే స్థాయి ఉద్యోగులు. బేసిక్‌, డీఏ కలిపితే సుమారు 22వేల వరకూ కండక్టర్‌ జీతం(26 రోజులకు) ఉంటుంది. అంటే 26 రోజులతో 22వేలను బాగిస్తే ఒక డ్యూటీకి రూ.840 వస్తుంది. డ్రైవర్‌కు కూడా ఇంచు మించు ఇదే జీతం వస్తుంది. అయితే డబుల్‌ డ్యూటీ చేసే డ్రైవర్లకు ఆర్టీసీలో రూ.450(రెండో డ్యూటీకి) చెల్లించేవారు. కండక్టర్లకు రూ.375 చెల్లిస్తున్నారు. తాజాగా డబుల్‌ డ్యూటీలు చేసే డ్రైవర్లకు రూ.800 ఇచ్చేలా సర్క్యులర్‌ జారీ చేసిన పీటీడీ.. కండక్టర్లకు మాత్రం రూపాయి కూడా పెంచలేదు. కార్మిక చట్టాల ప్రకారం డబుల్‌ డ్యూటీ చేసిన వారికి రెట్టింపు ఇస్తారని, రోజుకు సరాసరి రూ.840 బేసిక్‌ తీసుకుంటున్న తమకు రూ.1,680 ఇవ్వాల్సి ఉంటుందని, ప్రభుత్వమే ఇలా చేస్తే ఎవరికి చెప్పాలని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.