ఆ యాప్ ఉంటేనే ఆఫీసులో ఎంట్రీ !

August 11, 2020

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే.. తప్పనిసరిగా ప్రభుత్వం రూపొందించిన ఆరోగ్య సేతుయాప్ ను డౌన్ లోడ్ చేసుకొని తీరాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఒకవేళ ఎవరైనా కేంద్ర ఉద్యోగి యాప్ ను డౌన్ లోడ్ చేసుకోకుంటే వారిని.. ఆఫీసుకు అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
ఆరోగ్య సేతు యాప్ ను ప్రతి ఒక్కరు ఉపయోగించాలని.. కరోనాట్రాకర్ గా ఇది పని చేస్తున్న వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాప్  డౌన్ లోడ్ తప్పనిసరి చేయటం ఆసక్తికరంగా మారింది. కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఈ యాప్ ద్వారా తమ ఆరోగ్య సమాచారాన్ని పరీక్షించుకోవటంతో పాటు.. తమ చుట్టుపక్కల కరోనా పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలుసుకునే వీలుందని చెబుతున్నారు.
కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ఈ యాప్ లో సేఫ్ అని సూచించిన ఉద్యోగిని మాత్రమే ప్రభుత్వ కార్యాలయంలోకి అనుమతిస్తారని స్పష్టం చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంతో పాటు.. ఈ యాప్ లో తమ వ్యక్తిగత వివరాలు నమోదు చేసిన తర్వాత.. సదరు వ్యక్తి ఉండే ప్రదేశం.. ఆ వ్యక్తి చుట్టుపక్కల ఉన్న వారిలో కరోనా పాజిటివ్ లక్షణాలు ఉంటే.. వెంటనే అలెర్టు చేస్తుంది. దీంతో.. వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టే అవకాశం ఉంది.  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు.. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం ఈ రూల్ అమలవుతుందని చెబుతున్నారు. కేంద్రం విధించిన తాజా షరతుతో ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ లు పెద్ద ఎత్తున జరుగుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా కట్టడిలో ఆరోగ్య సేతు యాక్టివ్ గా పని చేస్తుందన్న మాట వినిపిస్తున్న వేళ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.