బ్రదర్ అనిల్ కుమార్ కు నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇష్యూ

May 26, 2020

కోరి కష్టాల్ని తెచ్చిపెట్టుకోవటం పలువురు ప్రముఖుల్లో కనిపిస్తూ ఉంటుంది. తప్పు చేశారా?  లేదా?  అన్న విషయాల్ని పక్కన పెడితే.. ప్రముఖుల్లో చాలామందికి ఏదో ఒక విషయానికి సంబంధించి కేసుల చిక్కుల్లో చిక్కుకుంటారు. అలా చిక్కుకున్న వేళ.. న్యాయస్థానాల విచారణ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కానీ.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తరచూ చిక్కుల్లో చిక్కుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి తలనొప్పినే ఎదుర్కొంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బావ బ్రదర్ అనిల్ కుమార్.

మత ప్రభోదకుడిగా మంచి పేరున్న బ్రదర్ అనిల్ కు తాజాగా ఒక కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ కావటం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి?  అరెస్ట్ వారెంట్ ఎందుకు ఇష్యూ అయ్యిందన్న విషయాన్ని చూస్తే.. దాదాపు పదేళ్ల క్రితం అంటే..2009 మార్చి 28న ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఖమ్మంలోని కరుణగిరి ప్రాంతంలో ఒక పార్టీకి ఓటు వేయాలని పాంప్లేట్స్ పంచారన్న ఆరోపణతో కేసు నమోదైంది. పదేళ్లుగా ఆ కేసు కొనసాగుతూనే ఉంది.
ఈ కేసులో ఏ1గా ఉన్న ముద్దాయి బ్రదర్ అనిల్ కుమార్. తాజాగా ఆయన కేసు విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. సోమవారం నాటికి కోర్టు ముందు ఆయన్ను ప్రవేశ పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సీరియస్ అయ్యే వరకూ విషయాన్ని తీసుకురాకుండా కాస్త అలెర్ట్ గా ఉంటే సరిపోతుంది కదా? ఈ చిన్న విషయాన్ని ప్రముఖులు ఎప్పటికి అర్థం చేసుకుంటారో?