సంచలనం - ఎన్నికల సంఘంలో తిరుగుబాటు

July 13, 2020

ఎన్నికల సంఘంపై 2019 లో వచ్చినన్ని ఆరోపణలు  గతంలో ఎన్నడూ రాలేదు. దేశంలో ఎన్నడూ లేనంత పక్షపాతంతో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. సాక్ష్యాధారాలు కూడా సమర్పించాయి.  ప్రజలు కూడా సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు చేశారు. సంఘటనలు ఉదహరించారు. దేశంలో ఎన్నికల సంఘం తీరు సరిగా లేదని దాదాపు అందరూ నమ్ముతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యుడు అయిన (సీఈసీలో ఒక ఛైర్మన్ ఇద్దరు సభ్యులుంటారు)  అశోక్ లవాసా ఎన్నికల సంఘంలో పక్షపాతం నిజమే అని కుండ బద్దలు కొట్టేశారు. మరొక సభ్యుడు, ప్రధాన ఎన్నికల కమిషనర్ అరోరా వివాదాస్పదంగా వ్యవహరించారని, ఒకరి వైపు మొగ్గు చూపారని ఆరోపిస్తూ లేఖ రాశారు. 

మోడీ వ్యతిరేక శక్తులందరూ అది జాతీయ పార్టీ కాంగ్రెస్ అయినా,  ప్రాంతీయ పార్టీలు అయినా ఎన్నికల సంఘం బాధితులు అయ్యాయి.  సాక్షాత్తు సభ్యుడే ఇపుడు ఈసీ తీరపై అసంతృప్తితో ఉండడంతో దేశంలో ఏం జరిగిందో అందరికీ అర్థమైంది. స్వయంప్రతిపత్తితో వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణి చూపడం ప్రజాస్వామ్యానికి ముప్పు. కేంద్ర ఎన్నికల సంఘంలో  అశోక్ లవాసా, సుశీల్ చంద్ర సభ్యులుగా ఉన్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా సునీల్ అరోరా ఉన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షాలు కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులను ఈసీ పట్టించుకోకపోగా, వారికి క్లీన్ చిట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తూ లవాసా ప్రధాన కమిషనర్ కు లేఖ రాశారు. 

ఈ లేఖలో అరోరాతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న మరో సభ్యుడు సుశీల్ చంద్ర తీసుకుంటున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉంటున్నాయని ఆయన ఆరోపించారు. వారిద్దరూ తన అభిప్రాయాలను అసలు పట్టించుకోవడంలేదని సన్నిహితుల వద్ద వాపోయారు. అశోక్ లవాసాతో బీజేపీయేతర పార్టీలు నైతిక మద్దతు దొరికినట్టయ్యింది. ఈ సంఘటనలతో ఎన్నికల సంఘం ఇరుకున పడింది.  దేశంలోని సీబీఐ, సుప్రీంకోర్టు, ఈసీ వంటి స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు ఏకపక్ష నిర్ణయాలపై ఆరోపణలు ఎదుర్కోవడం సామాన్యులను ఆందోళనకు గురిచేస్తోంది.