లీకుల్ని అరికట్టటంలో బిగ్ బాస్ ఫెయిల్ !

February 22, 2020

లీకుల్ని అరికట్టటంలో బిగ్ బాస్ ఫెయిల్ అవుతున్నాడు. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్న విషయం దాదాపు రెండు రోజుల ముందే లీకైపోవటంతో.. బిగ్ బాస్ చూసే వారికి ఉత్కంట అన్నది లేకుండా పోతోంది. ఏం జరుగుతుందన్న విషయం మీద క్లారిటీ వచ్చేయటం.. ఏలా జరుగుతుందన్నది మాత్రం చూడాల్సి రావటం చూస్తే.. రానున్న రోజుల్లో బిగ్ బాస్ ను చూసే ఇష్టం అంతకంతకూ తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ఊహించినట్లే ఈ వారం హౌస్ నుంచి అన్షూ ఎలిమినేట్ అయిపోయింది. సమంత ఫీచర్స్ తో ఉన్నట్లుగా చెప్పే అషూ రెడ్డి .. హౌస్ లో తనదైన ముద్ర వేయటంలో ఫెయిల్ కావటం.. ఈ వారం ఆమె వెళ్లిపోవటం ఖాయమని తేలిపోయింది. అందుకు తగ్గట్లే ఆమెను ఎలిమినేట్ చేస్తూ బిగ్ బాస్ నిర్ణయం తీసుకున్నారు. కాకుంటే.. హౌస్ నుంచి బయటకు వెళ్లే టైంలో మాత్రం నవ్వులు చిందిస్తూ.. మిగిలిన వారిని చీరప్ చేస్తూ.. తాను ఊహించిందే జరిగిందంటూ సరదాగానే ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
ఈ వారం రెండు ఆటలు ఆడించారు నాగ్. కెప్టెన్ శివజ్యోతికి జంతువుల పేర్లు.. వాటి గుణాలు చెప్పటం ద్వారా.. హౌస్ లో ఉన్న వారికి ఆ జంతువుల మాస్క్ తగిలించే ఆట ఫన్నీగా సాగింది. ఆ తర్వాత నువ్వే.. నేను అంటూ హౌస్ లో ఉన్న వారిని జంటలుగా చేసి.. ఆ జంటలోని ఇద్దరు ఎదుటోళ్ల క్యారెక్టర్ ను అనుకరించే గేమ్ ఫన్నీగా సాగిపోయింది. ఇందులో వితికను ఇమిటేట్ చేసిన అలీ రెజా హైలెట్ గా నిలిచారు. అలీ రెజా క్యారెక్టర్ ను అనుకరించటంలో వితిక ఇబ్బంది పడింది. బాబా భాస్కర్ పాత్రను అషూచేస్తే.. అషూను బాబా భాస్కర్ ఫన్నీగా అనుకరించారు. ఇలా సరదాగా సాగిపోయింది ఎపిసోడ్ మొత్తం. ఎలిమినేషన్ ప్రక్రియ సందర్భంలో మాత్రం వాతావరణం కాస్త గంభీరంగా మారినా.. అషూ వ్యవహరించిన తీరు ఆకట్టుకునేలా సాగింది.
అషూను ఎలిమినేట్ చేస్తున్నట్లు చెప్పినంతనే శివజ్యోతి పెద్ద ఎత్తున కన్నీళ్లు పెట్టుకుంది. తమ గుర్తుగా టీ షర్ట్ మీద కామెంట్స్ రాసేసి.. దానికి సూట్ కేస్ కు తగిలించి.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు అషూ. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఆమె చేత మరో ఆసక్తికరమైన గేమ్ ఆడించారు నాగ్.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వారి ఫోటోల్ని సిరామిక్ టైల్స్ మీద ప్రింట్ చేయించి ఉంచారు. అందులో ఉన్న వారిలో ఎవరు హౌస్ లో ఉండే అర్హత లేదో వారి ఫోటోల్ని పగలకొట్టాలని చెప్పారు. అర్హత ఉన్న వారి ఫోటోల్ని అలా ఉంచేయాలని చెప్పగా.. మహేశ్.. రాహుల్.. వితికా.. హిమజలకు హౌస్ లో ఉండే అర్హత లేదంటూ వారి ఫోటోల్ని పగులకొట్టేసింది. ఈ సందర్భంగా వారెందుకు హౌస్ లో ఉండకూడదో చెప్పేసింది. మొత్తంగా ఈ వారాంతం ఎపిసోడ్ మొత్తం నవ్వులు పూయిస్తూ.. ఫన్నీగా సాగిపోయింది.