అశ్వత్థామరెడ్డి అరెస్ట్.. సర్కారు మరో తప్పు చేసిందా?

July 08, 2020

ఏ ముహుర్తంలో మొదలైందో కానీ తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంతకంతకూ పెరుగుతూనే ఉంది కానీ తగ్గని పరిస్థితి. మూడు నాలుగు రోజుల్లో ముగిసిపోతుందని భావించిన సమ్మె కాస్తా ఏకంగా పదమూడు రోజులు గడిచి.. పద్నాలుగో రోజులోకి వచ్చేసింది. మొదట్లో కాస్త ఆచితూచి మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ నేతలు ఇప్పుడు గొంతు సవరించుకోవటమే కాదు.. సీఎం కేసీఆర్ మీద షాకింగ్ వ్యాఖ్యలు చేస్తున్నారు.
రాజ్యాంగ సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందన్న మాటతో పాటు.. ఉద్యమాన్నిహింసాత్మకంగా మార్చాలన్న ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారన్న మాటలతో ఒక్కసారిగా సంచలనంగా మారారు అశ్వత్థామరెడ్డి. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో పాపులర్ అయిన ఆయన.. ఇప్పుడు మరింత దూకుడుగా వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది.
రేపు (శనివారం) తలపెట్టిన తెలంగాణ బంద్ కు ముందస్తుగా ఈ రోజు బైక్ ర్యాలీలతో పాటు.. మరిన్ని కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న వేళ.. అనుకోనిరీతిలో ఒక పరిణామం చోటుచేసుకుంది. ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్న అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రేపటి బంద్ ను సక్సెస్ చేయాలని కోరుతూ బైక్ ర్యాలీని నిర్వహించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర అదుపులోకి తీసుకున్న ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఏ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారో అర్థం కాని పరిస్థితి. ఈ పరిణామంతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. రేపు నిర్వహించతలపెట్టిన తెలంగాణ బంద్ కు ముందుగా ఆర్టీసీ జేఏసీలో ముఖ్యమైన అశ్వత్థామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లటంతో భావోద్వేగాలు మరోస్థాయికి వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
ఇప్పటికే సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు వరుసగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. ఎలాంటి తప్పు చేయకనే అదుపులోకి తీసుకొని.. ఎక్కడకు తీసుకెళుతున్నది చెప్పకుండా ఉండటంపై పలువురు మండిపడుతున్నారు. ఆర్టీసీ సమ్మె ఎపిసోడ్ లో ఒకటి తర్వాత ఒకటిగా జరుగుతున్న తప్పులు కేసీఆర్ సర్కారుకు తలనొప్పులుగా మారతాయన్న మాట ఎంతమేర నిజమవుతుందన్నది కాలమే చెప్పాలి.