అసురన్ తెలుగు రీమేక్‌.. పేలుతున్న జోకులు

May 29, 2020

తమిళంలో సూపర్ హిట్టయి తెలుగులో రీమేక్ కాబోతున్న సినిమా ‘అసురన్’. ఈ సినిమా రిలీజైన రెండు వారాలకే తెలుగు రీమేక్ ఖరారైంది. ఈ సినిమాను వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నామని సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించి మరీ రీమేక్ పనులు మొదలుపెట్టింది. ఐతే ఈ సినిమాను తెలుగులో తీయడం కరెక్టా.. వెంకటేష్‌కు సూటవుతుందా.. దీన్ని ఆత్మ చెడకుండా తెలుగులోకి తీసుకొచ్చే దర్శకుడెవరు అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒక దశలో రీమేక్ ఆపేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ అదేమీ లేదని.. ‘అసురన్’ రీమేక్ పక్కాగా ఉంటుందని తాజా పరిణామాల్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాకు దర్శకుడిగా చాలా పేర్లు అనుకుని చివరికి శ్రీకాండ్ అడ్డాలకు ఆ బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.

ఐతే ‘అసురన్’ లాంటి వయొలెంట్ మూవీకి శ్రీకాంత్ లాంటి సాఫ్ట్ డైరెక్టరా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని మీద సోషల్ మీడియాలో అప్పుడే బోలెడన్ని జోకులు, మీమ్స్ పేలుతుండటం విశేషం. అందులో ఒక మీమ్ గురించి మాట్లాడుకుందాం. శ్రీకాంత్ తీసిన సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ ఇంట్రడక్షన్ సీన్ గుర్తుండే ఉంటుంది. అందులో తనకు ఎదురు పడ్డ వ్యక్తిని నవ్వుతూ పలకరించి వెళ్తాడు ప్రకాష్ రాజ్. దాన్ని దృష్టిలో ఉంచుకుని.. ‘అసురన్’ రీమేక్‌ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతుండటంపై ఒక మీమ్ తయారు చేశారు. విలన్ ప్రకాష్ రాజ్‌కు ఎదురు పడితే.. ‘‘ఏంట్రా రాత్రి మా పెద్దోడిని ఏసేశావ్ అంట.. ఇలా నరుక్కుంటూ పోతే నరకానికి పోతావ్ జాగ్రత్త. సర్లే వెళ్లు’’ అంటున్నట్లు.. విలన్ తర్వాత ‘‘చిన్నోడు చిదంబరం గాడ్ని కూడా వేసేస్తే ఓ పనైపోతుంది’’ అనుకుంటున్నట్లుగా ఈ మీమ్ రూపొందించారు. ఈ సినిమాకు ‘అసురన్ వాకిట్లో అరటి చెట్టు’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. ట్విట్టర్లో ఇలాంటి జోకులు, మీమ్స్ మరెన్నో కనిపిస్తున్నాయి. శ్రీకాంత్ సినిమాల్లో హింసకు తావే ఉండదు. చాలా సాఫ్ట్‌గా సాగిపోతాయి అతడి చిత్రాలు. ఏదో ఒక మంచి చెప్పాలని బలంగా ప్రయత్నిస్తాడు. అలాంటి దర్శకుడు ‘అసురన్’ లాంటి హింసాత్మక సినిమాకు దర్శకత్వం వహిస్తాడనేసరికి నెటిజన్లు ఇలా స్పందిస్తున్నారు.