అచ్చెన్నాయుడి అరెస్ట్

August 11, 2020

తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ వెళ్లిన పోలీసులు, ఏసీబీ అధికారులు శుక్రవారం తెల్లవారుజామున అచ్చెన్నాయుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ తరువాత ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు.

విజయవాడ చేరుకున్న తరువాత అక్కడి ఏసీబీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను విచారించనున్నారు.

ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?
ఈఎస్ఐలో అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై అచ్చెన్నను అదుపులోకి తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలు అక్రమాలు జరిగాయని గతంలో విజిలెన్స్ విభాగం తెలిపింది.
ఈ కేసులోనే అచ్చెన్నాయుడును ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

 

అసలేంటీ కేసు.. అచ్చెన్నాయుడు ఏమంటున్నారు?

అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో కుంభకోణం జరిగిందన్నది వైసీపీ నేతలు, ప్రభుత్వం ఆరోపణ.

ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో ఈ అక్రమాలు జరిగాయన్నది ఆరోపణ.

2014 - 2019 మధ్య ఐఎంఎస్ కి ముగ్గురు డైరెక్టర్లు పని చేశారు. ముగ్గురి హయాంలోనూ కొనుగోళ్లలో అక్రమాలు జరగాయని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చెబుతోంది. 

ఈ ముగ్గురి హయాంలో మొత్తం రూ. 975.79 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిగాయి. ఈ కొనుగోళ్లలో ఈఎస్ఐ పాటించాల్సిన నిబంధనలనూ, 2012 నాటి జీవో 51లోని నిబంధనలనూ పాటించలేదనీ, దాని వల్ల ఖజానా కోట్ల రూపాయల నష్టం చేశారని విజిలెన్స్ ఆరోపించింది. 

టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు ఇవ్వండి అని అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఒక లేఖ రాయడంతో అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆ లేఖ ఆధారంగా వారికి పనులు ఇచ్చేశారని ఆరోపిస్తున్నారు.

అయితే.. ఈ ఆరోపణలు వచ్చిన తరువాత అచ్చెన్నాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు.

తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తెలంగాణ రాష్ట్రంలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేయాలని మాత్రమే సూచించానని చెప్పారు. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి కాబట్టి చూసుకోవాలని చెప్పారు.

మొత్తానికి అధికారుల వైపు నుంచి జరిగిన తప్పులను అచ్చెన్నపై నెట్టి ఆయన్ను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు.. అసెంబ్లీలో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసే అచ్చెన్నను అరెస్ట్ చేసి మరికొద్ది రోజుల్లో జరగబోయే సమావేశాలకు రాకుండా చేయాలని.. ఆయన నోరు నొక్కాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.