అచ్చెన్నాయుడి కేసు.. అర్ధరాత్రి మలుపులు

August 05, 2020

ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలో ఈఎస్ఐ మందుల కొనుగోలులో జరిగిన అవకతవకలకు సంబంధించి అరెస్టయిన టీడీపీ అగ్ర నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడి కేసులో బుధవారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అచ్చెన్నాయుడిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీబీఐ అధికారులు చేస్తున్న విజ్ఞప్తిని మన్నిస్తూ.. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవాలంటూ బుధవారం విజయవాడ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసి సంగతి తెలిసిందే.

ఐతే చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడిని అక్కడే ఇబ్బంది పెట్టకుండా ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వైద్యుడి సమక్షంలో ఆసుపత్రిలోనే ఆయన్ని విచారించాలని సూచించింది. అచ్చెన్నాయుడు పడుకోవాలనుకుంటే పడుకునే, లేదా కూర్చోవాలంటే కూర్చునే సీబీఐ అధికారుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చని.. ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని న్యాయస్థానం చెప్పింది.

ఐతే నిన్న అర్ధరాత్రి ఉన్నట్లుండి పరిణామాలు మారిపోయాయి. అర్ధరాత్రి 12 గంటల సమయంలో అచ్చెన్నాయుడును డిశ్చార్జి చేయడానికి జీజీహెచ్‌ వైద్యులు రెడీ అయిపోవడం సంచలనం రేపింది. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకే ఆయన్ని అత్యవసరంగా డిశ్చార్జి చేయడానికి వైద్యులు సిద్ధమైపోయారని.. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే అచ్చెన్నాయుడిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోబోతున్నారని ప్రచారం జరిగింది.

దీంతో అర్ధరాత్రి మీడియా వాళ్లు అలెర్టయ్యారు. ఐతే విషయం తెలిసిన తెలుగుదేశం నేతలు ఆసుపత్రి వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. విజయవాడ అర్భన్ ఎస్పీతో పాటు కొందరు పోలీసులు కూడా ఆసుపత్రికి రావడంతో హైడ్రామా నెలకొంది. ఒక్కసారిగా ఆసుపత్రిలో ఆందోళనకర వాతావరణం నెలకొనడం, మీడియా వాళ్లు పెద్ద ఎత్తున చేరుకోవడం ఇది పెద్ద వివాదం అవుతుందని భావించిన ఆసుపత్రి వర్గాలు డిశ్చార్జిపై వెనక్కి తగ్గాయి. ఐతే గురువారం మాత్రం ఆయన్ని డిశ్చార్జి చేయడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు అచ్చెన్న బెయిల్‌ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది.