అచ్చెన్న అరెస్టుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

August 05, 2020

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని ఏసీబీ అదుపులోకి తీసుకోవటం.. అనంతరం పోలీసులు అరెస్టు చేసి విజయవాడకు తరలిస్తున్న వైనం తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఊహించని రీతిలో రియాక్టు అయ్యారు. అచ్చెన్నాయుడిని పోలీసులు కిడ్నాప్ చేశారని చెబుతున్నారు. దాదాపు వంద మంది పోలీసులు అర్థరాత్రి వేళ.. ఆయన ఇంటిపై దాడి చేసి కిడ్నాప్ చేశారన్నారు. కనీసం మందులు వేసుకోవటానికి కూడా అనుమతించలేదన్న చంద్రబాబు.. వారి కుటుంబ సభ్యులు ఫోన్లో కాంటాక్ట్ చేసినా అందుబాటులోకి లేకుండా చేశారన్నారు.
జగన్ ఉన్మాదం.. పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన చంద్రబాబు.. ‘అచ్చెన్నాయుడ్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలీలేదు. ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. ముందస్తుగా నోటీసులు జారీ చేయలేదు.  ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉదంతంపై సీఎం జగన్.. డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. అచ్చెన్నాయుడు వ్యవహారం బలహీన వర్గాలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

శాసనసభాపక్ష ఉప నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేయటం చట్టాన్ని ఉల్లంఘించటం కాక మరేమిటి? అని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందుగా ఇలాంటివి చోటు చేసుకోవటం దేనికి నిదర్శనం? అని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ విధానాల్ని తప్పు పడుతున్న అచ్చెన్నను ఇబ్బంది పెట్టేందుకు చట్టవిరుద్ధంగా కిడ్నాప్ చేశారన్నారు.

ఈ దుర్మార్గానికి.. ఉన్మాద చర్యకు నిరసనగా బలహీన వర్గాల ప్రజలు నిరసన తెలియజేయాలన్నారు. జ్యోతిరావు ఫూలే.. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేయాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిరసనలు.. ఆందోళనలు మరింత ప్రమాదకరమన్న విషయాన్ని బాబు మర్చిపోతున్నట్లుగా కనిపిస్తోంది.

అయితే... పరిస్తితి చేయిదాటిపోతుందని గ్రహించిన ప్రభుత్వం ఎట్టకేలకు అరెస్టు కింద చూపించింది. అనిశా అధికారులు మీడియా సమావేశం ద్వారా ఈఎస్ఐ స్కాంలో ఆయనను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

మార్కెట్ ధర కంటే సుమారు 50 శాతం నుంచి 130 శాతం అధిక ధరలకు మందులు కొనుగోలు చేశారని దర్యాప్తులో తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. మందుల కొనుగోళ్లలో రూ.150 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలిందని, అచ్చెన్నాయుడిని విజయవాడ కోర్టులో హాజరుపరుస్తున్నాం అని చెప్పారు.

అచ్చెన్నాయుడుతోపాటు మరో ఇద్దరు రమేష్ కుమార్, విజయ్ కుమార్ లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విజిలెన్స్ దర్యాప్తు తర్వాత అనిశా విచారణ జరిగిందని వారు పేర్కొన్నారు.