అచ్చెన్న అరెస్ట్, టీడీపీకి కొత్త ఊపిరులూదిన జగన్!

August 10, 2020

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడి అరెస్ట్ ఆ పార్టీకి కొత్త ఊపిరి ఊదిందా? ఈ అంశం చంద్రబాబు నాయుడుకు లేదా టీడీపీకి బ్రహ్మాస్త్రంలా మారిందా? అంటే అవుననే అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాజధాని మార్పు, విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష వంటి అంశాలపై టీడీపీ రోడ్డెక్కినప్పటికీ... అచ్చెన్న అరెస్ట్ పార్టీని బతికించిందని చెబుతున్నారు.

జగన్ ప్రభుత్వంపై పోరుకు టీడీపీ చాలా కాలంగా ఓ మంచి అస్త్రం కోసం చూస్తోందని, ఇప్పుడు అచ్చెన్న రూపంలో మంచి ఆయుధం దొరికిందని చెబుతున్నారు. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు ఈ అవకాశాన్ని సమర్థవంతంగా వినియోగించుకుంటాడని భావిస్తున్నారు.

మరో విషయం ఏమంటే ఈ కేసు వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నంత పెద్దది కాదని, పైగా జగన్ ప్రభుత్వం వచ్చాకే డబ్బులు చెల్లించారని, చంద్రబాబు హయాంలోనే విచారణకు ఆదేశించారనే అంశాలను టీడీపీ ప్రజల్లోకి బాగా తీసుకు వెళ్తోంది. ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నను అరెస్ట్ చేసిన తీరును, చంద్రబాబుకు ఆసుపత్రిలోకి వెళ్లేందుకు నిరాకరించడం వంటి అంశాలను జనాల్లోకి తీసుకెళ్లింది. ఓ బీసీ నేతపై జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తోంది.

ఏడాది కాలంగా ఎన్ని అవకాశాలు వచ్చినప్పటికీ అవి టెక్నికల్ లేదా ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలు కావడంతో టీడీపీకి బలంగా అందిపుచ్చుకునే పరిస్థితి లేకపోయింది. ఉదాహరణకు విద్యుత్ ఒప్పందాల పునఃసమీక్ష టెక్నికల్ అంశం. రాజధాని మార్పు అమరావతి-విశాఖలకు సంబంధించిన అంశం. దీంతో టీడీపీకి పెద్దగా అవకాశం రాలేదు.

మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు వంటి నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు. మరికొందరు నేతలు కూడా టీడీపీని వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి స్వయంగా జగన్.. అచ్చెన్న రూపంలో అస్త్రం ఇచ్చారని అంటున్నారు. అంటే భయపెట్టి, బెదిరించి పార్టీలు మారేలా ప్రోత్సహిస్తున్నారని టీడీపీ జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు కూడా అచ్చెన్న అంశం ఉపయోగపడనుందని చెబుతున్నారు.

అచ్చెన్నను అరెస్టు చేసిన తీరును వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా తప్పుబట్టారు. మొత్తానికి ఏడాది కాలంగా నిర్లిప్తంగా ఉన్న టీడీపీకి అచ్చెన్న రూపంలో జగన్ ప్రభుత్వంపై పోరుకు ఓ అవకాశం దొరికిందంటున్నారు.