అచ్చెన్నాయుడి కేసు - కీలక మలుపు

August 14, 2020

ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని జీజీహెచ్ వైద్యాధికారులు డిశ్చార్జి చేశారు. ఆయన ఆరోగ్యం మెరుగైనందున డిశ్చార్జి చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే, బెయిలు కోసం కోర్టులో విచారణ జరగ్గా... తీర్పును రిజర్వు చేసి జులై 3న వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. అంటే ఎల్లుండి బెయిలుపై తీర్పు వస్తుంది. అంతలోపు ఆయనను జైలుకు తరలించడంపై తెలుగుదేశం శ్రేణులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

దీనిపై తెలుగుదేశం ముఖ్యనేత నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ‘‘ అచ్చెన్నాయుడు ​గారిని బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ సైకోలా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించడం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఆపరేషన్ అయిన వ్యక్తిని 24 గంటలు రోడ్ల పై తిప్పి రెండోసారి ఆపరేషన్ కి కారణం అయ్యారు. ఇప్పుడు గాయం మానక ముందే డాక్టర్ల పై ఒత్తిడి చేసి డిశ్చార్జ్ చేసారు. చేస్తున్న ప్రతీ తప్పుకి జగన్ రెడ్డి గారు మూల్యం చెల్లించుకోక తప్పదు​ ‘‘

ఇదిలా ఉండగా... పిలిస్తే తానే వచ్చి అరెస్టు అయ్యే అచ్చెన్నాయుడిని గోడలు దూకి అరెస్టు చేయడంపై ఏపీ ప్రజలు విస్మయం వ్యక్తంచేశారు. ఇటీవల జగన్ ను అభిమానించే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అరెస్టులను తప్పుపట్టారు. ప్రతీకార పాలన సాగుతోందని విమర్శించారు. పైగా విజిలెన్స్ నివేదికలో 150 కోట్ల ప్రస్తావన వస్తే, ప్రభుత్వం అచ్చెన్నాయుడిపై కేసులో 3 కోట్లని మాత్రమే చెబుతోంది. మొత్తానికి ఈ కేసులో ఒక గందరగోళం నడుస్తోంది. 

ఇక తాజాగా ఆయనను డిశ్చార్జి చేసిన అనంతపురం పోలీసులు అంబులెన్సులో జైలుకి తీసుకెళ్లారు. ఈసారి కూడా భారీ బందోబస్తు ఏర్పాటుచేయడం గమనార్హం.