జేఎన్ యూలో కాళరాత్రి.. భయానక దాడి !!

August 14, 2020

ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్ యూ)లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలు దాటిన తర్వాత ముసుగులు ధరించిన యాభైకి పైగా ఆగంతకులు కర్రలు.. ఇనుపరాడ్లు..సుత్తులు.. రాళ్లు పట్టుకొని దాడికి పాల్పడ్డారు. కనిపించిన విద్యార్థిని కనిపించినట్లుగా దాడి చేశారు. హాస్టల్ ప్రాంగణంలోని మూడు సముదాయాల్లో దారుణ దాడికి తెగబడ్డారు.
అద్దాలు.. ఫర్నీచర్ తో పాటు.. ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. అసలేం జరుగుతుందో? దాడి చేసే వారెవరో అర్థం కాక విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. ఇదిలా ఉంటే.. జేఎన్ యూ ఎస్ యూ అధ్యక్షురాలు అయిషీ ఘోష్ తో పాటు మరో 28 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఘోష్ తలకు బలమైన గాయం తగలటంతో ఆమెతో పాటు ఇతర విద్యార్థులను హుటాహుటిన ఎయిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దాడికి కారణం వామపక్ష విద్యార్థి సంఘమని ఏబీవీపీ విద్యార్థులు ఆరోపిస్తుంటే.. ఇదేమీ కాదు ఆర్ఎస్ఎస్ ఉప సంఘమైన ఏబీవీపీకి చెందిన వారే దాడికి పాల్పడినట్లుగా వామపక్ష విద్యార్థి సంఘం వారు ప్రత్యారోపణ చేస్తున్నారు. ఈ ఉదంతంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. విద్యార్థుల దాడిని తీవ్రంగా ఖండించిన ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ జైజల్.. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వర్సిటీ పూర్వ విద్యార్థులపై కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్.. జయశంకర్ లు సైతం తీవ్రంగా ఖండించారు.
దాడికి సంబందించి వివరాలు అందిన వెంటనే పోలీసులు వర్సిటీలోకి చేరుకొని మార్చ్ చేశారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వర్సిటీలోని హాస్టల్ ప్రాంగణంలోకి అంత ధైర్యంగా ఎవరు దాడి చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అసలు గొడవకు కారణం ఎక్కడ? ఎలా? మొదలైందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
కొందరు చెబుతున్న దాని ప్రకారం జేఎన్ యూ ఉపాధ్యాయుల సంఘం ఏర్పాటు చేసిన శాంతి సమావేశంలో వామపక్ష్ సంఘాలు.. ఏబీవీపీ విద్యార్థుల మధ్య గొడవ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇది జరిగిన కాసేపటికే హింస చెలరేగినట్లుగా చెబుతున్నారు. సమావేశం ముగిసిన కాసేపటికి ముసుగులు ధరించిన కొందరు కర్రలు..ఇనుప రాడ్లు.. రాళ్లు పట్టుకొని వచ్చి అధ్యాపకులు.. విద్యార్థుల మీదా దాడికి పాల్పడ్డారు. తాము దాడి చేసినట్లుగా ఆరోపిస్తున్న ఆరోపణల్ని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తోంది.
తమ సంఘానికి చెందిన పాతిక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని.. పదకొండు మంది విద్యార్థుల జాడ తెలీటం లేదన్నారు. జేఎన్ యూ లో చోటు చేసుకున్న దాడిపై రాహుల్.. మమతా బెనర్జీ.. సీతారం ఏచూరీతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖండించారు. కాకుంటే.. దాడికి పాల్పడిన ఆగంతుకులు ఎవరన్నది ఇప్పటివరకూ తేల్లేదు. తాజాగా.. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరసనలు చేస్తున్నారు.