పోలీసే సాక్షి... రెడ్ జోన్లో మంత్రి గారి భారీ సభ

August 14, 2020

కరోనాకు భయపడని వాళ్లు ఇద్దరే ఇద్దరు... ఒకరు ట్రంప్, ఇంకొకరు జగన్. ట్రంప్ కి ఆ నొప్పి అయినా తెలుస్తోంది గాని జగన్ కి అది కూడా తెలియడం లేదు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని మీరు సిద్ధంగా ఉండండి... మీకు, నాకు కరోనా వస్తుంది అని చెప్పేశాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు కరోనాపై విజయం సాధిస్తాం. ప్రజలు సహకరించాలి... జాగ్రత్తలు తీసుకుని రాకుండా చూసుకోవాలి, సోషల్ డిస్టెన్స్ తో దీనిని చంపేద్దాం అని పిలుపునిస్తుంటే... వస్తే ఏం కాదు, వచ్చిన వారిని అంటరాని వాళ్లుగా చూడొద్దు అంటూ ఏకంగా రోగంతో కలిసి జీవించండి అని అత్యంత దారుణమైన, బాధ్యతరాహిత్యమైన కామెంట్లు చేశారు ముఖ్యమంత్రి జగన్.

ఆయనే అలా ఉంటే ఇక అనుచరులు ఎందుకు ఊరికే ఉంటారు. కరోనాతో కలిసి మెలిసి జీవించడానికి జనాల్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బియ్యపు మధుసూధన్ రెడ్డి, రోజా, తమ్మినేని సీతారాం తమ వంతు పాత్ర పోషించారు. తాజాగా మంత్రి అవంతి శ్రీినివాస్ నేనేం తక్కువ తిన్నానా అని మొత్తం... ఇంతవరకు ఏ వైసీపీ నేత సమీకరించనంత పెద్ద సంఖ్యలో జనాల్ని సమీకరించి బహిరంగ సభ పెట్టారు. జగనన్న విద్యా దీవెన సభ అది. చంద్రబాబు ఏం చేయలేదు.. ఇదిగో జగనన్న ఇన్ని వేల కోట్లు ఇస్తున్నారు అంటూ చెప్పడానికి సభ పెట్టారు. అసలు స్వయంగా మంత్రి లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా సభ పెడుతుంటే వందలాది మంది దానికి హాజరయ్యారు. పోలీసులు అక్కడే ఉండి కూడా సభను అనుమతించారు. 

అంటే తమ బాస్ జగన్ చెప్పినట్లు జనంతో కరోనా కలసి మెలసి జీవించడానికి మంత్రి గారు సహాయం చేస్తున్నారా? ప్రతి జిల్లాలో ఇదేతంతు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరూ తగ్గడం లేదు. ఒకవైపు కరోనా రాష్ట్రంలో విస్తరిస్తోంది. రోజుకు 80 కేసులు నమోదవుతున్నాయి. వీలైనంత త్వరగా కేసుల వ్యాప్తి తగ్గించి సాధారణ జనజీవనం నెలకొనేలా  చేయాల్సిన బాధ్యతాయుతమైన నేతలు ఇలా సామాజిక దూరమే లేకుండా జగనన్నను పొగడడానికి సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జాతీయ మీడియాలో ఇవన్నీ ప్రసారం అయినా.. బీజేపీ పెద్ద కళ్లు మూసుకుపోయి కనీసం వార్నింగ్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారంటే... మాకు ఒక్క సీటు కూడా ఇవ్వని ఏపీ సర్వనాశనం అయిపోయినా పర్లేదు అని భావిస్తున్నారో ఏంటో అర్థం కాని పరిస్థితి. 

ఇంత జరుగుతున్నా, సాక్ష్యాలున్నా కూాడా మంత్రి మోపిదేవి... కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలు స్లీపర్స్ సెల్స్ లా పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఆరోపణ చేస్తే నమ్మేలా ఉండాలి. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం మంత్రి అవంతి చేసింది నేరం. మరి ఆయనను అరెస్టు చేయకపోతే జగన్ ది తప్పుడు ప్రభుత్వమే కదా, జగన్ మీద చర్య తీసుకోకపోతే బీజేపీ మద్దతు జగన్ కి ఉన్నట్టే కదా. పక్కనున్న తెలుగు రాష్ట్రం కరోనాను తరిమేయడానికి శాయశ్శక్తులా కృషిచేస్తుంటే... ఏపీ నేతలు ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఏపీ ప్రజలు ఎలాంటి నాయకులకు ఓట్లేశాం రా దేవుడా కర్మ ఇది అనుకుంటూ బాధపడే పరిస్థితి.