3 షరతులకు ఓకే చెబితే బాబ్రీ కేసు వదిలేస్తారట సున్నీలు

August 07, 2020

సుదీర్ఘ కాలంగా సాగుతున్న అయోధ్యలోని వివాదాస్పద కట్టడానికి (కొందరు బాబ్రీ మసీదు అని.. మరికొందరు రామజన్మభూమి అంటూ వాదిస్తుంటారు. కోర్టు మాత్రం దాన్ని వివాదాస్పద కట్టడంగా పిలవాలని పేర్కొంది) సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వివాదాస్పద స్థలంపై తమకున్న హక్కును వదులుకోవటానికి కీలకమైన కక్షిదారుల్లో ఒకరైన సున్నీ వక్ఫ్ బోర్డు సంచలన ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది. ఈ వ్యవహారంలో యాజమాన్య హక్కుల కోసం ముగ్గురు (రామజన్మభూమి శిలాన్యాస్‌, నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్‌ బోర్డు) కక్షిదారులు పోరాడుతున్నారు.
ఇదిలా ఉండగా.. తాజాగా సున్నీ వక్ఫ్ బోర్డు సుప్రీం ఎదుట ఊహించని రీతిలో ఒక పరిష్కార ప్రతిపాదనను తీసుకొచ్చింది. తాము అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని వదిలేయాలంటూ మూడు ప్రధాన షరతులకు ఓకే చెప్పాలని కోరింది. ఇంతకూ ఆ మూడు ఏమిటన్నది చూస్తే..
1. దేశంలోని మసీదులన్నింటికీ రక్షణ కల్పించాలి. కబ్జాలు, విధ్వంసాలు జరగకుండా చట్టబద్ధ రక్షణనివ్వాలి. ఈ మేరకు 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని గట్టిగా అమలు చేయాలి.
2. దేశంలో పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) అధీనంలో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతినివ్వాలి.
3. బాబ్రీకి ప్రతిగా అయోధ్యలోనే వేరే చోట ఓపెద్ద మసీదును కట్టుకునేందుకు అనుమతినివ్వాలి. అయోధ్యలో 22 పాత మసీదుల మరమ్మతులకు సహకరించాలి.


ఒకవేళ దీనికి మిగిలిన ఇద్దరు కక్షిదారులు ఒప్పుకొని.. ప్రభుత్వం అందుకు సరేనంటూ తాము కేసు నుంచి బయటకు వస్తామంటూ పేర్కొంది. దీంతో.. ఈ వ్యవహారం అనూహ్య మలుపు తిరిగినట్లైంది. అయితే.. ఈ కేసులో ప్రధాన కక్షిదారైన రామజన్మభూమి శిలాన్యాస్ మాత్రం నో చెప్పింది.  మొదటి రెండు షరతులు ప్రస్తుత కేసు పరిధిలోకి రావని స్పష్టం చేయటంతో పాటు.. ఈ ప్రతిపాదన వేళ కూడా తమ వైఖరి మారదని స్పష్టం చేసింది. అయితే..తాము షరతుల్ని తిరస్కరించటానికి కారణాలు వేరే ఉన్నట్లుగా చెబుతున్నారు.
మిగిలిన మసీదుల ఆక్రమణ జరగరాదని.. వాటిని పరిరక్షించాలని కోరటమంటే మథుర.. వారణాసిల్లో ఉన్న వాటికి సంబంధించిన అంశాల్ని హిందుత్వ సంస్థలు వదులుకోవాలన్నదే అంతర్యమంటున్నారు. అలా ఎలా కుదురుతుందన్న వాదనతోనే న్యాస్ నో చెప్పినట్లు చెబుతున్నారు. మరి.. చివరకు ఈ వ్యవహారంపై సుప్రీం ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుందో చూడాలి.