అయోధ్య రాముడి కథ... సర్వత్రా ఉత్కంఠ

August 08, 2020

ఏళ్ల తరబడి వివాదంగా కొనసాగుతున్న అయోధ్య కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. దాదాపుగా ఎనిమిదేళ్లుగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతున్న ఈ కేసు విచారణ బుధవారం సాయంత్రంతో ముగిసినట్లుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రకటించారు. విచారణను ముగించిన సర్వోన్నత న్యాయస్థానం... ఈ వివాదంపై తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. తీర్పును త్వరలోనే ప్రకటించనున్నట్టుగా చెప్పిన జస్టిస్ గొగోయ్... ఆ తీర్పు వెలువడే రోజును మాత్రం ప్రకటించలేదు. దీంతో తీర్పు ఎప్పుడు వెలువడుతుందా? వెలువడే తీర్పు ఎలా ఉండబోతోంది? అన్న విషయాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం... నెల తిరిగే లోపలే ఈ కేసులో తీర్పును వెలువరించవచ్చన్న వాదనలు వినిపిస్తున్నా... దేశ చరిత్రలోనే ఓ మైలురాయిగా నిలిచిన ఈ కేసులో ఎవరికి విజయం వరిస్తుందన్న విషయం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. 

అసలు అయోధ్య కేసు ఏమిటన్న విషయానికి వస్తే... ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో 1996దాకా ఉన్న బాబ్రీ మసీదును కూల్చివేసిన హిందూవాదులు అక్కడ రామాలయాన్ని నిర్మించే యత్నం చేశారు. నాటి కరసేవకుల పేరిట జరిగిన మసీదు విధ్వంసం దేశంలో పెను కలకలం రేపింది. బాబ్రీ మసీదు ఉన్న స్థలంలోనే రాముడు జన్మించాడని, ఈ క్రమంలోనే అక్కడ మసీదుకు ముందు రామాలయం ఉండేదన్నది కరసేవకుల వాదన. ఈ వాదనను ముస్లింలు కూడా ఖండిస్తూ వచ్చారు. కేసు అలహాబాద్ హైకోర్టుకు చేరగా... అయోధ్యలోని వివాదస్పద స్థలంగా మారిన 2.77 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి వాదనను బయటకు తీసుకొచ్చిన రామ్ లల్లా విరాజమాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ సంస్థలకు సమానంగా పంచాలని అలహాబాదఓ్ హైకోర్టు 2010లో తీర్పు చెప్పింది. ఈ తీర్పును మూడు సంస్థలు వ్యతిరేకిస్తూ... సుప్రీంకోర్టులో ఆ తీర్పును సవాల్ చేశాయి. ఈ క్రమంలో రామజన్మభూమిపై దాఖలైన అన్ని పిటిషన్లను ఒక్కదరికి చేర్చిన సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 2011 నుంచి సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోందనే చెప్పాలి.

ఈ వివాదంపై ఎప్పటికప్పుడు రచ్చ జరుగుతుండగా... ఎట్టకేలకు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు నడుం బిగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ ధర్మాసనం ఈ కేసులో సుదీర్ఘ విచారణను చేపట్టింది. ఏకంగా 40 రోజుల పాటు అన్ని వర్గాల వాదనలను ధర్మాసనం విన్నది. చివరిగా బుధవారం ఈ కేసు విచారణను చేపట్టిన ధర్మాసనం... ఈ కేసులో ఇక్కడితో వాదనలు ముగిసినట్లుగా పేర్కొంది. అంతేకాకుండా విచారణ ముగిసిన నేపథ్యంలో త్వరలోనే తీర్పు వెలువరించనున్నట్లుగా కూడా ప్రకటించింది. ఇప్పటిదాకా ఈ వివాదంపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించిన ధర్మాసనం... ఇంకా దీనిపై ప్రజలు ఎవరైనా, ఏమైనా చెప్పాలనుకుంటే...చెప్పవచ్చని, నేరుగా కోర్టుకు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను చెప్పవచ్చని, ఇందుకోసం ఓ మూడు రోజుల పాటు వ్యవధిని నిర్దేశిస్తున్నట్లుగా కూడా కోర్టు వెసులుబాటు కల్పించింది. ఇప్పటిదాకా కొనసాగిన వాదనలు, ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించనున్నట్టుగా కోర్టు తెలిపింది. 

ఇదిలా ఉంటే.. 40 రోజుల పాటు  కొనసాగిన ఈ కేసు విచారణలో 39 రోజుల విచారణలో ఎప్పుడూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకున్నా.. చివరి రోజు విచారణలో భాగంగా ఈ కేసు విచారణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రామ్ లల్లా తరఫు న్యాయవాది, సున్నీ వక్ఫ్ తరఫు న్యాయవాదుల మధ్య కోర్టు హాలులోనే తోపులాట చోటుచేసుకొన్నాయి. దీంతో సుప్రీం సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ ఉద్రిక్తత చల్లబడింది. ఇదిలా ఉంటే... దేశంలో సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగిన రెండో కేసుగా అయోధ్య కేసు రికార్డుల్లోకి ఎక్కింది. ఏకంగా 40 రోజుల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఇక ఈ కేసులో తీర్పు నెల రోజుల లోపే విడులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వచ్చే నెల 17న జస్టిస్ రంజన్ గొగోయ్ సుప్రీం సీజేగా పదవీ విరమణ చేయనున్నారు. తాను పదవీ విరమణ చేసేలోగానే ఈ కేసులో తీర్పును వెలువరించనున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే.. వాదనలు 40 రోజుల పాటు కొనసాగితే... వాదనలు ముగిసిన నెల లోపే ఈ కేసులో తీర్పు వెలువడనుందన్న మాట. అంటే త్వరలోనే వెలువడనున్న ఈ తీర్పు ఎవరి పక్షమన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.