అయోధ్యపై తీర్పు వస్తోంది... అంతటా హై అలర్టే

August 03, 2020

భారత దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న క్షణం రేపు రానుంది. అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తన తీర్పును రేపు వెలువరించనుంది. రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంగా పరిగణిస్తున్న ఈ కేసులో తుది తీర్పు రేపు రానుండటంతో దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. శనివారం ఉదయం 10:30 గంటలకు అయోధ్య భూ వివాదంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తుది తీర్పును వెలువరించనుంది.

అనేక సంవత్సరాల పాటు కోర్టులు నానుస్తున్న ఈ కేసును చివరకు రేపు ముగించనున్నారు. రేపు తీర్పును బట్టి... ఇది ఎంత కాలం ఇంకా చర్చల్లో ఉంటుందో చెప్పవచ్చు. బాబ్రీ మసీదు కూల్చి దశాబ్దాలు దాటినా డిసెంబరు 6న సెక్యూరిటీ పెంచుతారు. అలాంటి నేపథ్యంలో ఏకంగా ఆ స్థలాన్ని ఎవరికి ఇస్తారో రేపు తేల్చనున్న నేపథ్యంలో ఇంకెంత సెక్యూరిటీ ఉంటుందో ఆలోచించొచ్చు. అందుకే శనివారం నుంచి దేశం మొత్తం హై అలర్ట్ గానే ఉండనుంది. అయోధ్య తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉన్నా... మరో వర్గంలో అసంతృప్తి ఖాయం. ఆందోళనలకు దిగే అవకాశాలు కూడా ఉండవని చెప్పలేం. దీంతో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భద్రత ఏర్పాట్లు చేసింది. రేపు యూపీలో స్కూళ్లు, కాలేజీలు సెలవు. ఒక్క యూపీలోనే 40 వేలకు పైగా సిబ్బంది మోహరించింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. 

తాజాగా ప్రధాని మోడీ దీనిపై స్పందించారు. రేపటి కోర్టు తీర్పు ఎవరి విజయమూ కాదు, ఎవరి ఓటమీ కాదు. శాంతి సుహృద్భావాలే శాశ్వతం అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రేపటి తీర్పుపై అనేక రకాలుగా ట్రెండ్స్ నడుస్తున్నాయి. అందరూ శాంతిగా ఉండాలని ప్రముఖులు పిలుపునిస్తున్నారు. దీనికి సోషల్ మీడియా వేదికవుతోంది.