మీ స్వార్థం కోసం దేశాన్ని తగులబెడతారా? ధ్వజమెత్తిన బాబు

July 06, 2020

కొన్ని రోజులుగా ఈవీఎంల పని తీరుపై, ఆంధ్రాపై ఎలక్షన్ కమీషన్ చూపిస్తున్న పక్షపాత వైఖరిపైన చంద్రబాబు దేశవ్యాప్త ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీలో మకాం వేసిన చంద్రబాబు ఈసీతో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఈసీ అధికారులను తన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ.. వారి మొండి వైఖరిని ఎండగుడుతున్నారు. తాజాగా మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరుగుతూ ధ్వజమెత్తారు. ఈ సందర్బంగా దేశాన్ని తాము ఏమైనా చేస్తాం అన్నట్లుగా అహంకారంతో వ్యవహరిస్తున్న వారిని తిప్పికొట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు బాబు.

రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ నేతలు, నరేంద్ర మోడీ భ్రష్టు పట్టిస్తున్నారని అంటూ దేశాన్ని దోపిడీ చేసి విదేశాలకు పారిపోతున్న వారికి మోడీ కాపలాకాశారంటూ బాబు నిప్పులు చెరిగారు. పైగా దేశానికి తానే కాపలాదారుడినని మోదీ గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోల్ ధరలు, రూపాయి విలువ ఇవన్నీ మోదీ ఘోరాతిఘోర వైఫల్యాలుగా పేర్కొన్నారు. 2 వేల నోటు తెచ్చిన మోడీ దేశానికి క్షమాపణ చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ‘‘వీవీప్యాట్‌లను లెక్కించమంటే కుదరదంటున్నారు.. వీవీప్యాట్‌లు ఎందుకు పెట్టారు.. అలంకారం కోసమా?’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలపై ఏకపక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దేశంలో ఎన్నికల కమిషన్‌ ఉందా? అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వీవీప్యాట్‌లు లెక్కించమంటే ఎందుకు భయపడుతున్నారని సీఎం ప్రశ్నించారు. మోసం చేయాలనే ఆలోచన ఉన్నవాళ్లే భయపడతారని, మోడీ తన బండారం బయటపడుతుందని భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లైన్స్‌ మీద ఇప్పటి వరకు మార్గదర్శకాలు ఎందుకు సిద్ధం చేయలేదని ప్రశ్నించారు. ఐదు చోట్ల వీవీప్యాట్‌లు లెక్కించాలన్నారని, ఎక్కడ లెక్కిస్తారు. ఏ ప్రాతిపదికన లెక్కిస్తారు అనే వివరాలు ఎందుకు సిద్ధం చేయలేదన్నారు. పోలైన ఓట్లకు, అసలు ఉన్న ఓట్లకు తేడాలు ఎందుకొస్తున్నాయని ప్రశ్నించారు. బ్యాలెట్ అయితే అలా జరిగి ఉండేదా అని అన్నారు. ‘మీ స్వార్థం కోసం దేశాన్ని తగులబెడతారా?’ అంటూ ధ్వజమెత్తారు. మేధావులు, విద్యార్థులు స్పందించాలన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గత కొన్ని రోజులుగా బాబు సంధిస్తున్న ప్రశ్నలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఇక మరోవైపు ఎన్నికల ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది ఏపీ ప్రజానీకం.