కేసీఆర్ పై బాబు ఫైర్..! కీలక సమయంలో మేల్కొన్న జనం

July 05, 2020

ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో జగన్ ని గెలిపించి చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడుతున్నారు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇప్పటికే ఓ వైపు ఆంద్ర ప్రజల అసమ్మతితో రగిలిపోతున్న కేసీఆర్ కి చంద్రబాబు ఊహించని సవాలు విసిరారు. హోదాకు మా మద్దతు ఉంది అని చంద్రబాబు సవాలుకు సమాధానం చెప్పిన కేసీఆర్.. ఊహించని విధంగా టీడీపీ అధినేత ఇచ్చిన రిటార్ట్ తో కుదేలైనట్లు తెలుస్తోంది. హోదాకు మద్దతు అని ప్రకటించి జగన్ ని ఒడ్డున పడేయాలని కేసీఆర్ చేసిన ప్రకటన తిరిగితిరిగి మళ్ళీ ఆయనకే ప్రతిబంధకంగా మారింది.

‘ఏపీకి ప్రత్యేక హోదాకు మా మద్దతు! పోలవరానికి మేం అడ్డంకి కాదు’ అని కేసీఆర్‌ చేసిన తాజా ప్రకటనపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ప్రత్యేక హోదాకు మద్దతు పేరిట కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని తెలుగుదేశం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేసీఆర్ పై ధ్వజమెత్తారు. ఇప్పుడు మద్దతు ఇస్తామంటున్న కేసీఆర్‌.. ఇదే హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు కలిసి రాలేదని బాబు ప్రశ్నించారు. 

బాబు మాట్లాడుతూ ''కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తామంటున్న జగన్‌.. మంగళవారం సాయంత్రంలోగా తమ ఫెడరల్‌ ఫ్రంట్‌ తరఫున కేంద్రానికి కేసీఆర్‌తో లేఖ రాయించాలి. పోలవరానికి అడ్డుపడటం లేదంటున్న కేసీఆర్‌.. ఈ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన కేసులు వాపస్‌ తీసుకోవాలి. ఏపీకి హోదా ఇస్తే తెలంగాణలో పరిశ్రమలు పోతాయని, తమకూ కావాలని కేసీఆర్‌ చెప్పలేదా? ప్రత్యేక హోదా ఇస్తామన్న సోనియాను విమర్శించలేదా? కేసీఆర్‌ ఎప్పుడూ నిజం చెప్పరు! జీవితమంతా అబద్ధాలే. ఆంధ్రావాళ్లు ద్రోహులని తిట్టలేదా? దద్దమ్మలని దూషించలేదా? కోడికత్తిపార్టీకి డబ్బులు ఇచ్చి డ్రామా ఆడిస్తే నమ్మడానికి జనం పిచ్చోళ్లు కాదు'' అంటూ ఫైర్ అయ్యారు. పోలవరం గ్రాఫిక్స్‌ అని మాట్లాడిన కేసీఆర్‌ ఇప్పుడు ముంపు గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. పోలవరం చూస్తే మోదీకి కళ్లు తిరుగుతాయని, అదీ నా సత్తానని అన్నారు బాబు. ‘భద్రాచలం మునిగిపోతుందని కేసీఆర్‌ మెలిక పెడుతున్నారు. భద్రాచలాన్ని, శ్రీరాముడిని మేం కాపాడుకుంటాం. సాగర్‌, శ్రీశైలం మీ కంట్రోల్‌లో పెట్టి.. పోలవరంలో మీకు వాటా ఇవ్వాలా? మీ పెత్తందారీ పాలన నా దగ్గర సాగదు’ అని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఎనీవేర్‌.. ఎనీటైమ్‌.. వాటర్‌ ఎవైలబులిటీగా ప్రాజెక్టుగా పోలవరాన్ని తీర్చిదిద్దుతున్నామని బాబు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీస్తే, నేనేంటో చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలుగు వారిపై దాడులు జరిగితే హైదరాబాదే కాదు… ఆస్ట్రేలియా, అమెరికానైనా వదిలేది లేదన్నారు చంద్రబాబు. ‘కేసీఆర్‌ మమ్మల్ని శాసిస్తావా? నువ్వు పోటుగాడివా? నీ భాషలోనే నిన్ను కట్టడి చేస్తా’ అంటూ చంద్రబాబు ధ్వజమెత్తడం విశేషం. జగన్, కేసీఆర్, మోడీ ముగ్గురూ కలిసి ఏపీపై కుట్ర పన్నుతున్నారు. సీమాంధ్రులు వారి కి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు బాబు. మరో రెండు రోజుల్లోనే ఎన్నికలు ఉండటంతో బాబు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో సంచలనంగా మారి.. ప్రజల్లో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి.