పాలన తెలియని అజ్జాని - జగన్ పై బాబు ఫైర్

July 05, 2020

ఏపీకి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందన్న విషయంపై ఇప్పటికే చాలా మంది చాలానే చెప్పినా... నవ్యాంధ్రకు తొలి సీఎంగా ఐదేళ్ల పాటు పనిచేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెప్పిన తీరే అతికినట్టు ఉందన్న మాట వినిపిస్తోంది.

కేవలం చంద్రబాబు తప్పులను భూతద్దం పెట్టి వెతికేందుకే సీఎం పోస్టులో కూర్చున్నట్టుగా జగన్ వ్యవహరిస్తున్నారని ఇప్పటికే చాలా మంది చెప్పేశారు. అయితే జగన్ అంతిమ లక్ష్యం ఏమిటన్న విషయంపై ఎవరికి తోచినట్టుగా వారు మాట్లాడినా... వంద రోజుల పాలనను పూర్తి చేసుకున్న జగన్ ఏ దిశగా వెళుతున్నారన్నవిషయంపై మంగళవారం చంద్రబాబు చాలా సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారన్న వాదన వినిపిస్తోంది.

గుంటూరు జిల్లా ప్రత్యేకించి పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు సాగిస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు పెద్ద పోరాటాన్నే మొదలెట్టేశారు. వైసీపీ దాడులతో ఇళ్లలో కూడా ఉండలేని రీతిలో తీవ్ర భయాందోళనలకు గురవుతున్న టీడీపీ కార్యకర్తలకు టీడీపీ ఏకంగా శిబిరాలనే ఏర్పాటు చేసింది. అదే సమయంలో విపక్షంలో ఉన్న సమయంలో పార్టీ న్యాయ విభాగం పార్టీకి అండగా నిలిచిన వైనాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు... మంగళవారం ఆ విభాగంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై చంద్రబాబు తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు.

సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రివర్స్ టెండర్లు అంటూ సాగుతున్న జగన్ ను చూసిన ప్రజలు మొన్న జరిగిన ఎన్నికలకు కూడా మరోమారు రివర్స్ ఎన్నికలు జరిగితే బాగుండునని అనుకుంటున్నారని చెప్పారు. అయితే రివర్స్ ఎన్నికలు జరిగే ఛాన్స్ లేదని చెప్పిన బాబు... మూడేళ్లలోనే జగన్ తన పాలనను ముగించక తప్పదని చెప్పేశారు. మోదీ సర్కారు జమిలి ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తున్న విషయాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... మరో మూడేళ్లలోనే జమిలి ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని, ఆ దెబ్బతో రాష్ట్ర ప్రజలకు జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెప్పుకొచ్చారు.

రాజధాని కూడా లేకుండా ఏర్పడిన నవ్యాంధ్రకు ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని తాము తలస్తే... ఆ కలను జగన్ పురిట్లోనే చంపేశాని చంద్రబాబు ఫైరయ్యారు. అవినీతిలో చిక్కుకుని ప్రతి శుక్రవారం కోర్టు మెట్లెక్కే జగన్ తనను ప్రశ్నించడమేమిటని కూడా చంద్రబాబు నిప్పులు చెరిగారు. గతంలో తనపై 26 కేసులు వేసినా... ఒక్క దానిలోనూ ఆరోపణలను నిరూపించలేకపోయారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

తాను సీఎంగా పదవి చేపట్టి వంద రోజులు అవుతున్నా... చంద్రబాబు తప్పులు దొరకబుచ్చుకోవడం లేదన్న కారణం చూపుతూ అధికారులు, మంత్రులపై జగన్ చిందులు తొక్కుతున్నారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ ఇప్పుడున్న పరిస్థితులు లేవన్న చంద్రబాబు... ఈ వంద రోజుల్లోనూ టీడీపీ కార్యకర్తలపై 565 కేసులు పెట్టారని ఆరోపించారు. ప్రజల్లో జగన్ ప్రభుత్వాన్ని నేరస్థ ప్రభుత్వంగా నిలబెట్టేవరకు వదిలిపెట్టేదే లేదని చంద్రబాబు శపథం చేశారు.

Read Also

జ‌గ‌న్‌కు మాజీ ఎంపీ వింత సూచ‌న‌...
జగన్ దిగిరాక తప్పలేదు... ఇదే రీజన్
మోదీ లెటర్.. జగన్ నుంచి నో రిప్లయ్.. ఎందుకు?