చింతమనేనికి బాబు భరోసా... వైసీపీకి ఇక బ్యాండే

July 05, 2020

టీడీపీ సీనియర్ నేత, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ సర్కారు లెక్కలేనన్ని కేసులు నమోదు చేసింది. కాస్తంత దురుసుగానే కనిపించే చింతమనేనికి తన సొంత నియోజకవర్గంలో తిరుగులేని నేతగానే పేరుంది. చింతమనేని అలాగే కొనసాగితే... దెందులూరే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగానూ ప్రభావం చూపే అవకాశాలూ లేకపోలేదన్న విశ్లేషణలు వినిపించాయి. ఇదే విషయాన్ని బాగానే పట్టేసిన వైసీపీ... తాను అధికారంలోకి రాగానే ఎలాగైనా చింతమనేనిని బలహీనపరచాలని యత్నించింది. అందులో భాగంగానే ఆయనపై నిన్నటిదాకా ఏకంగా 19 కేసులు నమోదైపోయాయి. 18 కేసుల్లో బెయిల్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ర్యాలీగా ఇంటికెళితే.. దానిపైనా కేసు పెట్టారంటేనే... చింతమనేని అంటే వైసీపీ ఏ మేర భయపడిపోయిందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.

చింతమనేని పేరు వింటేనే వణికిపోయిన వైసీపీ... ఆయనను ఏకంగా 66 రోజుల పాటు జైల్లో పెట్టింది. రెండు నెలల పాటు జైల్లో ఉన్న చింతమనేని ఇక తమ దారికి వస్తారులే అనుకున్నారో? ఏమో?... తెలియదు గానీ వెంటనే మరో కేసు పెట్టేశారు. ఇన్ని చేసినా చింతమనేనిలోని పౌరుషం ఇసుమంత కూడా తగ్గలేదు. వైసీపీ వేధింపులు ఇకపైనా కొనసాగుతాయన్న భావన అయితే చింతమనేనిని ఓ మోస్తరు ఆందోళనకు గురి చేసిందన్న వాదన అయితే వినిపించింది. ఇలాంటి కీలక తరుణంలో పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోమవారం చింతమనేనిని పరామర్శించి దన్నుగా నిలుస్తామని ధైర్యం చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సమీక్షకు వెళ్లిన సందర్భంగా చింతమనేని ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు... చింతమనేనితో పాటుగా ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 

వైసీపీ వేధింపులకు బెదరాల్సిన అవసరం లేదని, పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా చింతమనేనికి చంద్రబాబు చెప్పారు. అంతేకాకుండా చింతమనేని ధైర్యాన్ని ప్రస్తావిస్తూ... పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడంలో చింతమనేనికి సాటి రాగల వారు ఎవరూ లేరని కూడా చెప్పారు. చింతమనేని కుటుంబానికి తామంతా అండగా ఉంటామని, వైసీపీ బెదిరింపులకు అదరాల్సిన అవసరం లేదని కూడా చంద్రబాబు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అక్రమ కేసులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ భయపడొద్దని ధైర్యం చెప్పారు. వివిధ కేసులకు సంబంధించి ఏలూరు జిల్లా జైల్లో 67 రోజుల పాటు చింతమనేని ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు నేరుగా తన ఇంటికి వచ్చి మరీ భరోసా ఇవ్వడంతో చింతమనేని మరింత ఉత్సాహంగా కనిపించారు. ఈ ఉత్సాహం చూస్తుంటే.. మున్ముందు వేధింపులకు దిగే వైసీపీకి చింతమనేని చుక్కలు చూపించడం ఖాయమేనని చెప్పక తప్పదు.