ఏప్రిల్లోనూ టాలీవుడ్ హాహాకారాలే

August 07, 2020

ఫిబ్ర‌వ‌రి ఆరంభం నుంచి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర్కొంటోంది టాలీవుడ్. ఆ నెల‌లో భీష్మ మిన‌హాయిస్తే ఏ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. వ‌సూళ్లు బాగా ప‌డిపోయాయి. ఇక మార్చి గురించి ఎంత త‌క్కువ చెప్పుకుంటే అంత మంచిది. తొలి రెండు వారాల్లో వ‌చ్చిన సినిమాల్ని జ‌నాలు అస్స‌లు ప‌ట్టించుకోలేదు. ఇంత‌లో క‌రోనా వైర‌స్ ధాటికి థియేట‌ర్లే మూత‌ప‌డిపోయాయి. మార్చి 31 వ‌ర‌కు థియేట‌ర్లు తెరుచుకోబోవు. క‌నీసం ఏప్రిల్ ఆరంభం నుంచి అయినా ప‌రిస్థితులు మెరుగు ప‌డ‌తాయి.. థియేట‌ర్లు తెరుచుకుంటాయి.. జ‌నాల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతాయి అనుకుంటే అలాంటి సంకేతాలేమీ క‌నిపించ‌డం లేదు. క‌రోనా వైర‌స్ ప్ర‌భావం అంత‌కంత‌కూ పెరుగుతోంది త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. మున్ముందు ఇంకా ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు త‌లెత్తేలా ఉన్నాయి.
ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతున్న రేటు చూస్తుంటే.. ఏప్రిల్లో దేశ‌మంతా ఒక ర‌క‌మైన సంక్షోభాన్ని ఎదుర్కొనేలా ఉంది. మున్ముందు సూప‌ర్ మార్కెట్లు కూడా మూత ప‌డే ప‌రిస్థితి రావ‌చ్చంటున్నారు. థియేట‌ర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకునేలా లేవు. ఒక వేళ తెరుచుకున్నా జ‌నాలు థియేట‌ర్ల‌కు ఇప్పుడిప్పుడే వ‌స్తారా అన్న‌ది డౌటే. ఈ నెల‌లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌లు చాలా వ‌ర‌కు వ‌చ్చే నెల‌కు వాయిదా ప‌డ‌టం కూడా స‌మ‌స్యే. అలాగే షూటింగులు కూడా పునఃప్రారంభం కావ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. దీంతో సినిమాల్ని న‌మ్ముకున్న వాళ్లంద‌రికీ క‌ష్టాలు త‌ప్పేలా లేవు. షూటింగులు ఆగిపోయి, రిలీజ్‌లు వాయిదా ప‌డ‌టంతో నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాలు త‌ప్పేలా లేవు. ఇక సినీ రంగంలో రోజు వారీ ఆదాయం మీద ఆధార‌ప‌డే వాళ్ల ప‌రిస్థితి చెప్పాల్సిన ప‌ని లేదు. వాళ్ల జీవితాలే సంక్షోభంలో ప‌డిపోనున్నాయి. ఇప్ప‌టికే అవ‌స్థ‌లు ప‌డుతున్న వాళ్లంతా వ‌చ్చే నెల వ‌చ్చే స‌రికి ఏమ‌వుతారో అన్న ఆందోళ‌న నెల‌కొంది.