జగన్, కేసీఆర్ ఆశలపై నీళ్లు !

May 25, 2020

తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలకు అసంతృప్తిని కలిగించే ఓ వార్తను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గురువారం చెప్పారు. అసెంబ్లీ సీట్ల పెంపుపై టీఆర్ఎస్, వైసీపీలు ఎంతోకాలంగా ఆశలు పెట్టుకున్నాయి. కానీ అసెంబ్లీ సీట్ల పెంపుకు అవకాశం లేదని కేంద్రమంత్రి వ్యాఖ్యలతో మరోసారి తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంచాల్సి ఉంది. కానీ ఈ సీట్ల పెంపుపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

దేశమంతా అసెంబ్లీ సీట్ల పెంపు ఉన్నప్పుడే తెలుగురాష్ట్రాల్లోను ఉంటుందని చెప్పారు. పార్లమెంట్ చట్టం ప్రకారం ప్రత్యేకంగా రెండు రాష్ట్రాల్లోనే సీట్ల పెంపుకు అవకాశం లేదన్నారు. గత పాలకులు ఏపీ విభజన చట్టంలో ఇష్టారీతిన ఎన్నో అంశాలు పెట్టారన్నారు. తద్వారా సాధ్యం చేయలేని అంశాలు పెట్టారని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా నాడు రాత్రికి రాత్రే సీట్ల పెంపు అంశాన్ని జత చేశారన్నారు.

దేశంలో సీట్ల పెంపు పరిణామాలపై కేంద్రం ఇప్పటి వరకు ఆలోచన చేయలేదన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీట్ల పెంపుకు సంబంధించి న్యాయ శాఖ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. కిషన్ రెడ్డి గురువారం ఢిల్లీలో బ్లాక్ లెవల్ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాశ్మీర్‌లో సీట్ల పెంపు ప్రక్రియ ప్రారంభం కాలేదని చెప్పారు. దీనిపై లోతుగా ఆలోచిస్తున్నామన్నారు. దానికి పార్లమెంటులో చట్టం చేయాల్సి వస్తుందన్నారు.

జగన్, కేసీఆర్‌లో అసెంబ్లీ స్థానాల పెంపు కోసం విభజన అనంతరం నుండి ఎదురు చూస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందే కూడా అసెంబ్లీ సీట్ల పెంపుపై జోరుగా చర్చ సాగింది. తెలంగాణ సీట్లు 150కి, ఏపీ సీట్లు 225కి పెరుగుతాయని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ టెక్నికల్ సహా వివిధ కారణాలతో ఆలస్యమవుతోంది. తాజాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో మరోసారి అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో ఉండదని తేలిపోయింది.