ఎన్నిక‌ల బ‌రిలో బాల‌య్య అల్లుడు

July 22, 2019

ఏపీ రాజ‌కీయాల్లో వార‌సుల హ‌డావుడి పెరిగిపోతుంది. ఇప్ప‌టికే టీడీపీలో ఉన్న అగ్ర‌నేత‌ల పిల్ల‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ప‌నిలో ఉన్నారు. బాల‌య్య కూడా త‌న కుటుంబం నుంచి ఓ వార‌సుడిని దింపే ప‌నిలో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.
రాబోయే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైన బాలకృష్ణ రెండో అల్లుడు, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్‌కు టీడీపీ టికెట్ దక్కుతుందా లేదా అనే అంశంపై కొద్ది రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది. భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి లోకేశ్ పోటీ చేస్తారని వార్తలు రావడంతో... ఇక భరత్‌కు విశాఖ ఎంపీగా పోటీ చేసే అవకాశం రానట్టే అనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అనూహ్యంగా లోకేశ్‌ను మంగళగిరి నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో... బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌ పోటీకి దాదాపుగా లైన్ క్లియర్ అయినట్టే అని జిల్లా రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు కూడా పోటీ హోరాహోరీగా ఉంటుందనే భావనలో ఉన్న టీడీపీ ముఖ్యనేతలు... బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపితేనే బాగుంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే భరత్‌కు ఎంపీ సీటు ఇవ్వాలని బాలకృష్ణ గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో... ఎలాగైనా అతడికి ఎంపీ సీటు దక్కొచ్చని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైనట్టే అని అనిపిస్తోంది. మ‌రి బాబు ఎలా స్పందిస్తారో చూడాలి.