​కొత్త నిర్ణయం తీసుకున్న బాలయ్య ​

April 06, 2020

నందమూరి బాలకృష్ణ... నటనలో శిఖరాలు చూశారు. ఇండస్ట్రీ రికార్డులు సృష్టించారు. సినిమాల్లో ఫ్యాక్షన్ జానర్ బాలయ్యతోనే మొదలైంది. ఆ జానర్ లో బాలయ్య అనేక బంపర్ హిట్లు కొట్టారు. ఆ తర్వాత దాదాపు అందరు హీరోయిలు బాలయ్యను ఫాలో అయ్యారు. నందమూరి తారక రామారావు వంటి మహా మనిషికి వారసుడు అయినా ఆ స్థాయిని దక్కించుకోలేక పోయారు. అయితే అదంత సులువు కూడా కాదు. కాకపోతే నందమూరి వారసుడిగా ఎన్టీఆర్ సెంటిమెంట్ నియోజకవర్గం అయిన హిందూపురం నుంచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా నిలబడి గెలిచారు బాలకృష్ణ. 

బాలయ్యలో మూడు రూపాలుంటాయి. ఒకటి రాజకీయం,రెండు సినిమా... మూడు సామాజిక సేవ. అనేకసార్లు బాలయ్య యారోగెంట్ గా బిహేవ్ చేసినా... ఇతరులకు సాయం చేయడంలో మాత్రం బాలయ్యది చాలా పెద్ద మనసు. సాయం చేసే గుణం ఎక్కువ. తల్లి పేరుతో ప్రారంభించిన బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ప్రస్తుతం బాలయ్య చేతుల్లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఎందరికో ప్రాణదానం చేసిన మహా ఆలయం ఆ ఆసుపత్రి. కొన్ని వేల కుటుంబాలకు ఊపిరి పోసింది. దాంతో మరింత అంకితభావంతో పనిచేయాలని బాలయ్య కూడా నిర్ణయించుకున్నారు. ఇటీవల ఆస్పత్రికి సంబంధించి అనేక సార్లు బాలయ్య బాగా పాజిటివ్ ట్రెండ్ సొంతం చేసుకున్నారు. అయితే కొన్ని సార్లు ఆస్పత్రి కార్యక్రమాల వేదికలపై పొలిటికల్ కామెంట్లు చేశారు. దానివల్ల కార్యక్రమ ఉద్దేశం జనాలకు తెలియకుండా పోయింది. బాలయ్య ఎపుడైతే అలాంటి కామెంట్లు చేశారో... ఆయా రోజుల్లో కార్యక్రమం గురించి మీడియా రాయడం మానేసిబాలయ్య చేసిన రాజకీయ వ్యాఖ్యాలపై చర్చలు మొదలుపెట్టింది. దీంతో సేవా కార్యక్రమాలపై అది ప్రతికూల ప్రభావం చూపడం మొదలుపెట్టింది. 

రాజకీయ వ్యాఖ్యల ప్రభావం వల్ల కలిగే నష్టంపై ఆస్పత్రి వర్గాలు బాలయ్యతో చర్చించాయి. దీంతో ఆయన తన విధానాన్ని మార్చుకుంటాను అని చెప్పారట. మనకు ఆస్పత్రి కంటే ఏదీ ముఖ్యం కాదు అని పేర్కొన్నారట. అందుకే ఇకపై క్యాన్సర్ ఆస్పత్రి కార్యక్రమాల్లో బాలయ్య... ఓన్లీ బాలయ్య. ఎమ్మెల్యే బాలయ్య కాదు. ఏదేమైనా ఇది అభినందించదగ్గ నిర్ణయమే. ఇటీవల రోజుల్లో మీడియా గాసిప్స్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అలాంటపుడు వాటికి అవకాశం ఇవ్వకుండా ఉండటమే మంచిది.