NBK 60 : బాలకృష్ణ లైఫ్ సీక్రెట్స్ !!

August 07, 2020

టాలీవుడ్ లో నందమూరి వంశానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దశదిశలా వ్యాప్తి చేశారు. ఎన్టీఆర్ పేరు నిలబెడుతూ ఆయన వారసులు సినీరంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకించి అన్నగారి తనయుడు నందమూరి బాలకృష్ణ తండ్రి నటనా కౌశల్యాన్ని, రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. అన్నగారి అడుగుజాడల్లో నడుస్తున్న బాలయ్య బాబు...విలక్షణ పాత్రలతో వెండితెరపై వెలిగిపోతున్నారు.

పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్....ఇలా అన్ని రకాల సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. నవరసాలను అవలీలగా పండిస్తున్న బాలయ్య బాబు...జూన్ 10న 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికాలోనూ బాలయ్య 60 వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. లాక్ డౌన్ లేకపోయుంటే 60 స్పెషల్ గా ఓ రేంజ్ లో ఉండేవి. కానీ అయినా బాలయ్య అభిమానులను ఆపగలరా... అందుకే నిబంధనల్లోనే వినూత్నంగా చేస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా 60 నగరాల్లో 60 కేకులు కట్ చేయడంతోపాటు వివిధ కార్యక్రమాలు...ఎన్నారై కోమటి జయరాం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరగబోతున్నాయి.  

టాలీవుడ్ లోని `లెజెండ్`లలో బాలకృష్ణ ఒకరు. బాలయ్య అంటేనే ఒక ఎమోషన్. కత్తులతో కాదురా....కంటి చూపుతో చంపేస్తా అంటూ నరసింహనాయుడు సినిమాలో పవర్ ఫుల్ డైలాగ్ చెప్పిన బాలయ్య....సమరసింహా రెడ్డి, చెన్నకేశవ రెడ్డి, లెజెండ్, సింహా వంటి హై ఇంటెన్స్ యాక్షన్ మూవీస్ లో ప్రేక్షకులను మెప్పించారు. పరుచూరి బ్రదర్స్ కలానికి బాలయ్య గళం తోడు కావడంతో ధియేటర్లలో విజిల్స్ మోత మోగేది. ఆదిత్య 369 వంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలో ఓ వైపు శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రలో నటించిన బాలయ్య...మరోవైపు ఆధునిక భావాలున్న యువకుడి పాత్రలో మెప్పించారు.

సెంటిమెంట్, ఎమోషన్, అగ్రెషన్ తో మాస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశారు. బాలయ్య తొడగొడితే రికార్డులు...మీసం తిప్పితే అవార్డులు...అని ప్రశంసలు దక్కించుకున్నారీ `లెజెండ్`. నాటి తరం అగ్రహీరోలలో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన బాలయ్య.....నేటి తరం యువ హీరోలతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ దగ్గర `పైసా వసూల్` చేస్తున్నారు. `అరె మామా ఎక్ పెగ్ లా`...అంటూ గొంతు సవరించి మరీ కుర్రకారుకు దీటుగా స్టెప్పులేస్తున్నారు. జూన్ 10న 60వ పుట్టినరోజు జరుపుకుంటున్న బాలకృష్ణ
గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నమస్తే ఆంధ్ర పాఠకుల కోసం అందిస్తున్నాం.

1960, జూన్ 10న నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు బాలకృష్ణ ఆరో సంతానంగా జన్మించారు. చెన్నైలో పుట్టిన బాలయ్య బాల్యం, విద్యాభ్యాసం హైదరాబాద్ లో సాగింది. బాలకృష్ణ విద్యాభ్యాసం హైదరాబాద్ లో పూర్తి కాగా...నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఇంటర్ పూర్తయిన వెంటనే సినిమాల్లో నటించాలనుకున్న బాలయ్య....తండ్రి కోరిక మేరకు బి.ఏ వరకు చదివారు. ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన `తాతమ్మకల` చిత్రంతో 14 సంవత్సరాల వయస్సులో బాలకృష్ణ తెరంగేట్రం చేశారు.

కెరీర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ నటించిన, దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువగా సహాయనటుడి పాత్రలు పోషించారు బాలయ్య. తాతమ్మకల( బాలకృష్ణ పాత్రలో), దానవీరశూరకర్ణ( అభిమన్యుడు పాత్రలో), అక్బర్ సలీం అనార్కలి(సలీం పాత్రలో), శ్రీ మద్విరాట్ పర్వం( అభిమన్యు పాత్రలో), శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం(నారదుడు పాత్రలో) చిత్రాలలో నటించాడరు. శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్రలో సిద్ధా పాత్ర రూపంలో మొట్టమొదటిసారిగా బాలయ్యకు కీలకమైన పాత్ర లభించింది. 

జూన్ 1, 1984 వ సంవత్సరంలో `సాహసమే జీవితం` తో హీరోగా తొలిసారి నటించారు బాలకృష్ణ. దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి తో కలసి 11 సినిమాలు, కోడి రామకృష్ణ తో ఏడు సినిమాలు, కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆరు సినిమాలలో నటించాడు. 1987వ సంవత్సరంలో బాలకృష్ణ ఏకంగా 8 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. సాహస సామ్రాట్, ప్రెసిడెంట్ గారి అబ్బాయి, మువ్వగోపాలుడు భానుమతిగారి మొగుడు చిత్రాలున్నాయి.
 
సొంతపేరుతో బాలకృష్ణ ఏడు సినిమాల్లో నటించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో బాలయ్య తన తొలి చిత్రం ‘తాతమ్మకల’లో నటించారు. బాలకృష్ణ 25వ చిత్రం ‘నిప్పులాంటి మనిషి’. ఎస్‌.బి.చక్రవర్తి దర్శకుడు. 50వ చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇక 75వ చిత్రం ‘క్రిష్ణబాబు’ ముత్యాల సుబ్బయ్య దర్శకుడు. 100వ చిత్రం ‘గౌతమీపుత్రశాతకర్ణి’ క్రిష్ దర్శకత్వం వహించారు.

ఎన్టీఆర్‌ నటించిన ‘యమగోల’ చిత్రాన్ని బాలకృష్ణతో తీయాలనుకున్నా..అది కుదరలేదు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ యముడిగా, బాలకృష్ణ హీరోగా చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అదే జరిగి ఉంటే అరుదైన కాంబినేషన్ చరిత్రల నిలిచిపోయి ఉండేది. పౌరాణికంతోపాటు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ‘భైరవ ద్వీపం’ వంటి జానపద చిత్రాలలోనూ బాలయ్య నటించి మెప్పించారు. ‘భైరవద్వీపం’ లో కురూపి వేషం బాలయ్య వేశారన్న విషయాన్ని దాచిపెట్టారు. ఆ మేకప్‌ వేసుకోవడానికి తీయడానికి రెండు గంటలు సమయం పట్టేదట.
 
‘ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌’, ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’, ‘లక్ష్మీ నరసింహా’, ‘అల్లరి పిడుగు’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర చిత్రాల్లో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు.‘భార్యాభర్తల బంధం’ ‘గాండీవం`చిత్రాల్లో అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి నటించారు. ‘నిప్పు రవ్వ’, ‘బంగారు బుల్లోడు’ సినిమాలు ఒకే రోజు బాలకృష్ణ మొత్తం 15 చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేయగా, ‘అధినాయకుడు’లో ట్రిపుల్‌రోల్‌ పోషించారు. బాలకృష్ణ అతిథి పాత్రలో నటించిన ఏకైక చిత్రం ‘త్రిమూర్తులు’.

బాలకృష్ణ నటించిన 35 చిత్రాలకు పరుచూరి బ్రదర్స్‌ ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పనిచేశారు. బాలయ్య పరుచూరి బ్రదర్స్‌ రాసిన కథతో ‘అల్లరి కృష్ణయ్య’ కథ క్లాష్‌ అయింది. దీంతో పరుచూరి బ్రదర్స్‌ ‘ప్రెసిడెంట్‌గారి అబ్బాయి’ కథ రాశారు. ఈ సినిమాకు భానుప్రియ బదులు సుహాసిని నటించారు. ఆడదని తెలిసినా, తండ్రి ఎన్టీఆర్ మాటకు గౌరవం ఇచ్చి నటించిన చిత్రం ‘తిరగబడ్డ తెలుగు బిడ్డ’.  పుష్పానంద్‌ చెప్పిన లైన్‌ ఆధారంగా ‘లారీడ్రైవర్‌’ ను తీర్చిదిద్దారు పరుచూరి బ్రదర్స్.‌ అంతకుముందు పరుచూరి బ్రదర్స్ చెప్పిన కథ బి.గోపాల్‌కు నచ్చకపోవడంతో పుష్పానంద్ కు అవకాశం దక్కింది.
 
బాలకృష్ణ డైలాగ్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు, డైలాగ్‌ లాంగ్వేజ్‌ మార్చిన చిత్రం ‘రౌడీ ఇన్‌స్పెక్టర్‌’. ఈ సినిమా కోసం బాలకృష్ణ రోజూ పోలీస్‌ జీపులోనే షూటింగ్‌కు వచ్చేవారు. సమరసింహం టైటిల్ అంతగా బాగోలేకపోవడంతో ‘సమర సింహారెడ్డి’ టైటిల్ ఖరారు చేశారు. ‘నరసింహనాయుడు’లో `` కత్తులతో కాదురా...కంటిచూపుతో చంపేస్తా డైలాగ్‌  షూటింగ్‌ చివరి రోజున పరుచూరి గోపాలకృష్ణ రాశారు.

సెట్‌కు రాగానే సహ నటీనటులకు, సాంకేతిక బృందానికి విష్‌ చేసి షాట్‌కు వెళ్లడం బాలయ్య బాబుకు అలవాటు. బాలకృష్ణ తాను నటించిన చిత్రాల్లో ఎక్కువగా ఇష్టపడేది ‘సమర సింహారెడ్డి’. రజనీకాంత్‌ నటించిన చిత్రాల్లో ‘ముత్తు’, అమితాబ్‌ ‘అగ్నిపథ్‌’,  చిరంజీవి ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమాలంటే బాలకృష్ణకు ఇష్టం. బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’ చిత్రానికి చిరంజీవి ప్రమోషన్ చేశారు. ‘విశ్వామిత్ర’ షూటింగ్‌ సమయంలో కపాల మోక్షం పొందే నేపథ్యంలో పొరపాటున ఒకటికి బదులు రెండు టపాసులు పేలాయి. ఓ వైపు కాలికి గాయమై రక్తం కారుతున్నా, షాట్‌ పూర్తయ్యే వరకూ బాలకృష్ణ కదలక పోవడం ఆయనకు నటనపై ఉన్న అంకితభావానికి నిదర్శనం.

బాలకృష్ణ రాముడిగా కనిపించిన చిత్రం ‘శ్రీరామరాజ్యం’. బాలకృష్ణ కృష్ణుడిగా ‘కృష్ణార్జున విజయం’, ‘పాండురంగడు’ చిత్రాల్లో కనిపించారు. సినిమాల్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఎన్నికైన అతి తక్కువమంది నటుల్లో బాలకృష్ణ ఒకరు. స్వీయ దర్శకత్వంలో ‘నర్తనశాల’ తెరకెక్కించాలనేది బాలకృష్ణ చిరకాల కోరిక. దానికి తగ్గట్టే సినిమా చిత్రీకరణ ప్రారంభించినా... వివిధ కారణాల వల్ల సినిమా ఆగిపోయింది. బాలకృష్ణ ఉత్తమ నటుడిగా ‘నరసింహనాయుడు’, ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు.

బాలకృష్ణకు 1982లో వసుంధర దేవితో వివాహం అయింది. వీరికి తేజస్వి, బ్రాహ్మణి ఇద్దరు కూతుళ్లు కాగా, మోక్షజ్ఞ కుమారుడు.  బాలకృష్ణ తెల్లవారుజామున 3.30 గంటలకు నిద్రలేవగానే భూదేవికి నమస్కారం చేసి కాళ్లు కిందపెడతారు. తప్పనిసరిగా యోగా, వ్యాయామం చేస్తారు. బాలకృష్ణకు భక్తి ఎక్కువ. దేవుడిని నమ్ముతారు. సూర్యోదయం అవ్వకముందే పూజా కార్యక్రమం ముగిస్తారు.భర్తగా, తండ్రిగా తన కర్తవ్యాన్ని ఎప్పుడూ విస్మరించలేదంటారు బాలయ్య.
 
హైదరాబాద్‌లో రామకృష్ణ థియేటర్‌ డాబా మీద తన అన్నదమ్ములతో కలిసి బాలయ్య ఆడుకునేవారు. సంక్రాంతికి గాలిపటాలు ఎగరేసేవారు. అద్దె సైకిళ్లు తీసుకుని ట్రూప్‌ బజార్‌, సుల్తాన్‌ బజార్‌ లలో బాలయ్య చక్కర్లు కొట్టేవారు. బాలకృష్ణకు తెలుగు భాష, పద్యాలు, పురాణాలను ఓ తెలుగు మాస్టర్ బోధించేవారు. పరిస్థితులు, ప్రాంతాలను బట్టి అన్నిరకాల ఆహార పదార్థాలను బాలయ్య తింటారు. సినిమాల్లో పాత్రను బట్టి తన డైట్‌ మెయింటెన్ చేస్తారు. కానీ, రాత్రి పూట మాత్రం భోజనం చేయరు.
 
Recent items :