అమెరికాలో ఘనంగా NBK@60 సెలబ్రేషన్స్- 60 నగరాలు, 60 కేకులు

August 12, 2020

నడకలో, నడతలో సింహం ... సేవలో వినయం, వినమ్రత.  మిగతా హీరోలకు అభిమానులు, ఇష్టపడే అనుచరులు ఉండొచ్చు... కానీ నందమూరి బాలకృష్ణకు మాత్రమే ప్రాణమిచ్చే అభిమానులు , పడిచచ్చే అనుచరులు ఉంటారు. బాలయ్య కోపం తాత్కాలికం... బాలయ్య ప్రేమ శాశ్వతం. అందుకే ప్రపంచంలో వారికి ఆయన పేరు అంటే మోజు, మాట వింటే ఊపు.

ఇలాంటి అభిమానులను ఒక్కటి చేస్తే ఎలా ఉంటుంది... అన్న ఆలోచనతో కోమటి జయరాం చేసిన ఒక చక్కటి ప్రయత్నం అమెరికాలో విజయవంతం అయ్యింది. 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని అమెరికాలోని 60 నగరాల్లో 60 కేకులు కట్ చేసి వైవిధ్యంగా... బాలయ్య పుట్టిన రోజును వేడుకగా నిర్వహించారు బాలయ్య అభిమానులు. 
ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ...  బే ఏరియాతో బాలయ్యకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఇక్కడ గతంలో రెండు సార్లు నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజును మనందరితో ప్రత్యక్షంగా ఘనంగా జరుపుకున్నారని తెలిపారు.  ఈ 60వ పుట్టిన రోజును కూడా అమెరికా ప్రభుత్వ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ ఘనంగా జరుపుకున్నాం అన్నారు. ఇదో కొత్త అనుభూతి అని ఆయన వ్యాఖ్యానించారు. చివరి నిమిషం సమాచారంతో ఇంత మంది బాలయ్య అభిమానులు ఏకమై ఆయా నగరాల్లో  పుట్టిన రోజు వేడుకలకు పెద్ద ఎత్తున హాజరుకావడం అభినందనీయమం అన్నారు. ఎక్కడా నిబంధనలు తప్పకుండా తమ అభిమానాన్ని చాటుకుని వేడుకల్లో పాల్గొన్న వారిని కోమటి జయరాం ప్రత్యేకంగా అభినందించారు.