‘‘ఏపీలో ఎన్నికలు రద్దు చేయండి’’

June 04, 2020

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సినీ థ్రిల్లర్ ను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీనేతల ఏకగ్రీవాలపై వివాదం.... కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడడం...ఆ తర్వాత ఎస్ ఈసీ రమేష్ కుమార్ లేఖ....రమేష్ కుమార్ తొలగింపు....కొత్త ఆర్డినెన్స్ ద్వారా కొత్త ఎస్ ఈసీగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ బాధ్యతల స్వీకరణ....వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. మరోవైపు తన తొలగింపుపై నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించడం....ప్రభుత్వంతోపాటు నిమ్మగడ్డ రమేష్ కౌంటర్ దాఖలు చేయడం జరిగాయి. ప్రస్తుతానికి ఈ వివాదంపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయాలని...మళ్లీ మొదటి నుంచి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికల ప్రక్రియ రద్దు చేయాలని కోరుతూ... ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని...కన్నా లేఖలో పేర్కొన్నారు. చాలా స్థానాలను దాడులు, దౌర్జన్యాలతో అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుందని కన్నా ఆరోపించారు. ఏపీలో అధికార పార్టీ దౌర్జన్యాలకు అధికారులు, పోలీసులు సహకరించారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి దౌర్జన్య కాండ ఎన్నడూ జరగలేదని, స్థానిక ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌కు కన్నా విజ్ఞప్తి చేశారు.  కాగా, నిమ్మగడ్డ రమేష్‌ పిటిషన్‌పై హైకోర్టులో రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ కౌంటర్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిల్‌తో పాటు దాఖలైన 12 పిల్స్‌కు ఒకే కౌంటర్ దాఖలు చేశారు. ఓటరు, అభ్యర్థి కాకుండా ఎస్ఈసీ అర్హతలపై ఎలా రిట్ దాఖలు చేస్తారని కనగరాజ్ ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్‌కు మినహా మిగతా ఎవరికీ ఈ అంశంలో పిల్ దాఖలు చేసే అర్హత లేదని కనగరాజ్ కోర్టుకు తెలిపారు. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను పిటిషనర్లు ప్రశ్నించలేరని కౌంటర్‌ పిటిషన్‌లో కనగరాజ్ పేర్కొన్నారు. ఆర్డినెన్స్ ద్వారా తొలగించాక నిమ్మగడ్డ కమిషనర్ హోదాలో పిల్ ఎలా వేస్తారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలపై దాఖలైన ఫిర్యాదులు ఒక్కశాతం కూడా లేవని తెలిపారు. స్థానిక ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని పేర్కొన్నారు.